కార్లు బహుమతిగా వచ్చాయంటూ మస్కా- గిఫ్ట్ కార్డుతో మోసగించే ముఠా అరెస్టు
ఆన్లైన్‌లో కార్లు గిఫ్ట్‌గా వచ్చాయంటూ మోసం చేసే ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
సమాజంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి వివిధ రకాల యాప్స్, వెబ్ సైట్స్‌లో విక్రయిస్తున్నాం. కొన్ని రకాల వెబ్‌సైట్స్, యాప్స్‌లో వచ్చే ఆఫర్ల కోసం తరచూ అన్వేషిస్తూ ఉంటాం. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని కొందరూ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. లక్షల రూపాయలను కాజేసి షాక్ ఇస్తుంటారు. తరచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వింటూ, చూస్తూనే ఉంటాం.
అందుకే సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. అవేవీ పట్టించుకుండా సైబర్ నేరగాళ్ళ మాయమాటల్లో పడి పోతున్నారు కొందరు. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యాక లేదా అప్పుల్లో మునిగిపోయాక ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి కేటుగాళ్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆన్లైన్ ద్వారా కార్లు గిఫ్ట్‌గా వచ్చాయంటూ మోసం చేసే ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు, 30 మొబైల్ ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు..
చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. గిఫ్ట్ కారు మీకు వచ్చిందని పోస్టుల ద్వారా గిఫ్ట్ వోచర్ పంపించి కార్డు స్కాచ్ చేస్తే మీకు ఇన్నోవా కారు ఇచ్చేస్తామంటూ నమ్మబలికిందీ ముఠా. జిఎస్టి, డెలివరీ టాక్స్ కడితే కారు సొంతమైపోతుందని గ్యాస్ కొట్టారు. అలా చేసి వేల రూపాయలు దోపిడీ పాల్పడుతున్న ఈ ముఠాపై జిల్లాలో దాదాపు 25 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు ఎక్కువ అయ్యాసరికి చిత్తూరు వన్ టౌన్ సిఐ నరసింహరాజు ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్సై అనిల్ కుమార్ చిత్తూరు వన్ టౌన్ సిబ్బంది ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు.
మోసాలకు పాల్పడుతున్న వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో చిత్తూరు రిజర్వు ఫారెస్ట్ సమీపంలో మెసానికల్ మైదానం వద్ద ఐదు మంది ఉన్న సమాచారాన్ని తెలుసుకొని పక్కా ఆధారాలతో ముఠా పట్టుకున్నారు. వారిని విచారణ చేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. వీరు బృందాలు ఏర్పడి బాధితుల ఫోన్ నెంబర్లు, అడ్రెసులు సేకరించి పథకం ప్రకారం గిఫ్ట్ కార్డులు పంపించేవాళ్లు. వివిధ రకాల వస్తువులు అందిస్తామని చెప్పి మోసగించే వారు.
వీరిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 21 మంది, కల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు, గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్‌లో ఇద్దరు ఫిర్యాదు చేశారు. పూతలపట్టు పరిధిలో బాధితులు ఉన్నారని తెలిస్తోంది. చిత్తూరు పరిసర ప్రాంతల్లో 25 మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించారు పోలీసులు.
మోసాలు చేసేందుకు నిందితులు ఉపయోగించిన 30 సెల్‌ఫోన్లు, రెండు లాప్ టాప్‌లను, 500 గిప్టు కార్డులను, ఏటీఎం కార్డులను, 1 లక్ష 80 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరూ ఊరికే బహుమతులు ఇవ్వబోరని.. ఇచ్చినా డబ్బులు కట్టించుకోరని చెప్పారు పోలీసులు.