Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆర్జితసేవా టికెట్ల విడుదలపై ప్రకటన
Tirumala news: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 2025 సంవత్సరం జనవరి నెల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala news: తిరుమల శ్రీవారి భక్తులకు 2025 సంవత్సరం దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త చెప్పింది. స్వామివారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
అక్టోబరు 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. దర్శన టిక్కెట్లు పొందేందుకు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
తుపాను కారణంగా తిరుమల తిరుపతి లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఈవో శ్యామల రావు వర్చువల్ సమావేశం నిర్వహించి అధికారులు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్నందున నిఘా ఉంచి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జనరేటర్లు, డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఐటీ వింగ్ అధికారులు భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ కావాల్సిన సిబ్బంది, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు.ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లు పర్యవేక్షించాలని, అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించడం గురువారం వరకు నిలిపి వేసింది టీటీడీ. మరో వైపు తిరుమల లోని పాపవినాశనం, శిలా తోరణం, మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాలను టీటీడీ పునరుద్ధరణ చేయనుంది.