Paritala Sunitha: ఆర్టీసీ బస్సెక్కి పరిటాల సునీత ప్రచారం, వైసీపీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ
పరిటాల సునీత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రయాణీకులకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి వివరించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు. గ్రామ గ్రామానికి వెళ్లడమే కాకుండా వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ఇందులో గురువారం (అక్టోబరు 12) ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రయాణీకులకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి వివరించారు. కనగానపల్లి మండలం గుదివాండ్లపల్లి నుంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గ మధ్యలో రైతులు, కూలీలను కలుస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టు మీద కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆ మార్గంలో ఆర్టీసీ బస్సురాగా ఆమె బస్సు ఆపి ప్రయాణీకులతో పాటు కొంత దూరం ప్రయాణించారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును వారికి వివరించారు. ఇందుకు సంబంధించి కరపత్రాలు కూడా అందజేశారు.
ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో ఎలాంటి అవినీతి చేయకపోయినా.. అక్రమంగా జైలుకు పంపారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో.. సీఎం జగన్ రెడ్డి ఏం చేశారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై అన్ని వర్గాల వారు ఆగ్రహంగా ఉన్నారని సునీత అన్నారు. రానున్న రోజుల్లో దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని సునీత అన్నారు.
నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు షాక్!
ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది.
ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి చంద్రబాబు గత నెల రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్ రిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఫైబర్ నెట్ కేసులో సోమవారం ఆయన్ను ప్రత్యక్షంగా హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం (అక్టోబరు 12) సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.