Tirumala Roblox Video: తిరుమల యాత్ర పేరుతో గేమింగ్ వీడియోస్- Roblox కంపెనీపై టీటీడీకి ఫిర్యాదు
Tirumala Roblox Video: తిరుమలపై రోబ్లాక్స్ రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జనసేన నేతలు టీటీడీకి ఫిర్యాదు చేశారు.

Tirumala Roblox Video: Roblox ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన గేమింగ్ యాప్. ఈ వీడియోలు పిల్లలను పెద్దలను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ గేమింగ్ యాప్ తిరుమలపై చేసిన వీడియోలపై వివాదం మొదలైంది. తిరుమల యాత్ర పేరుతో వీడియోలు చేస్తున్నారు. ఇందులో ఆడే వ్యక్తులు, చూసే వ్యక్తులు కొన్ని హర్డిల్స్ దాటుకొని లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. వివిధ లెవల్స్‌లో ఆటంకాలు ఒక్కోలా ఉంటాయి. గమ్యం లేని ప్రయాణంలా సాగిపోతూ ఉంటుంది గేమ్.
ఈ Roblox గేమ్‌కు మరింత లోకలైజ్ చేసేందుకు కొందరు స్థానికంగా ఉంటే ప్రాంతాలను రిఫరెన్స్‌గా తీసుకొని గేమ్స్ రన్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ గేమ్‌లో ఆడేవాళ్లకు ఎంత మజా వస్తుందో యూట్యూబ్‌లో చూసేవాళ్లకు అంతే మజా వస్తుంది. అందుకే అలాంటి వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత పెద్ద ఆటంకాలు దాటుకుంటూ వెళ్తే అన్ని వ్యూస్ వస్తాయి. అందుకే దీన్ని లోకలైజ్ చేసి వీడియో వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నారు.
రోబ్లాక్స్ వీడియో గేమ్స్‌కు లోకల్ ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నంలో వికృత చర్యలు
ఇలా లోకలైజ్ చేసే క్రమంలో తిరుమలకు సంబందించిన వీడియో కూడా కొందరు యూట్యూబర్లు చేశారు. ఇప్పుడు అదే వివాదమైంది. తిరుమల యాత్రపై వీడియోలు సృష్టించి భక్తులను మోసగిస్తున్నారని roblox కంపెనీపై టీటీడీకి ఫిర్యాదులు అందాయి. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని.....సోషల్ మీడియాలో నయో మోసాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.
మోసాలపై టీటీడీ ఛైర్మన్ బిఆర్‌నాయుడుకు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. తిరుమల మీద గేమ్ డిజైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఛైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను అదేశించారు. తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలతో రోబ్లాక్స్ వీడియో సృష్టించారు. దైవభక్తిని వాడుకొని డాలర్స్ రూపంలో అన్ లైన్‌లో వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఛైర్మన్.
ఫిర్యాదు తర్వాత కిరణ్ రాయల్ ఏమన్నారంటే...?
ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కిరణ్... శ్రీవారికి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గేమ్ డిజైన్ చేశారని అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుంది అని గేమ్ డిజైన్ చేశారని వెంటనే ఆ గేమ్ అకౌంట్ ని తొలగించాలని టిటిడిని కోరానన్నారు. ఈ గేమ్‌లు కొనసాగిస్తే ఉగ్రవాదులకి శ్రీవారి ఆలయం ఎలా ఉంటుంది అనేది ఈజీగా తెలిసిపోతుందన్నారు. భవిష్యత్తులో టీటీడీపై ఏమైనా చేయాలంటే భయపడే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీని కోరామన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇతర తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆయా ఆలయాలపై చాలా గేమ్ డిజైన్ చేసి ఆన్‌లైన్‌లో వదిలారని అన్నారు. కచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలని కోరారు.





















