Police On Narayana Bail: నారాయణ బెయిల్ రద్దు కోరుతూ పోలీసుల పిటిషన్
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.
పదోతరగతి పరీక్ష లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ బెయిల్‌పై చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అడిషినల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి చిత్తూరు జిల్లా పోలీసుల తరఫున పిటిషన్ దాఖలు చేశారు.
పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీలో మంత్రి నారాయణదే కీలక పాత్ర ఉందని కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని పదో తేదీన అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
అదే రోజు రాత్రి అర్థరాత్రి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి నారాయణ. అర్థరాత్రి దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘమైన విచారణ చేపట్టారు న్యాయమూర్తి సులోచనారాణి. నారాయణ విద్యాసంస్థ ఛైర్మన్ పదవికి 2014నే రాజీనామా చేశానని ప్రస్తుతం తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టులో వాదించారు నారాయణ తరఫున లాయర్స్.
నారాయణ తరఫు వాదించిన న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మాజీమంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఇవాళ పిటిషన్ వేశారు.