తిరుమలలో చిక్కిన మరో చిరుత - 15 రోజుల వ్యవధిలోనే మూడింటిని పట్టుకున్న అధికారులు
తిరుమలలో ఆరు నెలల నుంచి చిరుతల సంచారంతో ఒకటే టెన్షన్. దీనికి తోడు ఓ చిన్నారి కూడా వన్యమృగం బలి తీసుకోవడంతో భక్తులు మరింత బెదిరిపోయారు.
నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు హ్యాపీ న్యూస్. గత కొన్ని రోజులుగా బయపెడుతున్న చిరుతను అటవీశాఖాధికారులు బంధించారు. రాత్రి ఏడో మైలు వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇకపై నడక మార్గంలో ఎలాంటి భయం ఉండబోదని అంతా భావిస్తున్నారు.
తిరుమలలో ఆరు నెలల నుంచి చిరుతల సంచారంతో ఒకటే టెన్షన్. దీనికి తోడు ఓ చిన్నారి కూడా వన్యమృగం బలి తీసుకోవడంతో భక్తులు మరింత బెదిరిపోయారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని నడక మార్గం నుంచి వెళ్లాలంటేనే భయపడిపోయారు.
ఓ బాలుడిని లాక్కెళ్లిపోవడం, ఇంకోబాలికను చిరుత చంపేయడంతో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. బాలుడిని లాక్కెల్లిన టైంలో ఓ చిరుతను పట్టుకున్నారు. అదే టైంలో బాలికను బలి తీసుకున్న రెండు రోజుల్లోనే ఇంకో చిరుతను బంధించి ఊపిరి పీల్చుకున్న అధికారులకు మరో చిరుత టెన్షన్ పెట్టింది. ఇది చిరుత అన్నట్టు హడావుడి నడిచింది. రకరకాల పుకార్లు కూడా షికారు చేశాయి.
ఇంకో చిరుత ఉందని నిర్దారించుకున్న అటవీశాఖా అధికారులు సాంకేతికతను ఉపయోగించి చిరుత జాడను పసిగట్టారు. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు అమర్చారు. ఎక్కువ ఎక్కడ తిరుగుతుందో అంచనాకు వచ్చారు. అలాంటి ప్రదేశాలను గుర్తించి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసినప్పటికీ చిరుత చిక్కకుండా అధికారులకు ముప్పు తిప్పలు పెట్టింది. ఊరిస్తున్నట్టు బోను వరకు వచ్చి వెనుదిరగడంతో అంతా టెన్షన్ పడ్డారు. చివరకు ఏడో మైలు వద్ద బోనులో చిక్కింది చిరుత.
వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుత ఇలా చిక్కింది. చిరుతను బోనులో బంధించేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేశారు. వివిధ వ్యూహాలతో బోనులోకి రప్పించేందుకు ట్రై చేశారు.
జూన్ 24న ఓ చిరుతను బంధించారు అధికారులు. ఆగస్టు 14న మరొకటి., ఆగస్టు 17 ఇంకొంకటి, ఇవాళ నాల్గో చిరుతను బంధించారు. మధ్యలో ఓ ఎలుగుబంటిని కూడా బంధించారు.