Tirupati News : వైసీపీ నేతలు శాశ్వత పదవులతో పుట్టారా?, తిరుపతి మాస్టర్ ప్లాన్ వెనుక పెద్ద స్కామ్ - హరిప్రసాద్
Tirupati News : వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తుందని జనసేన నేత హరిప్రసాద్ ఆరోపించారు. వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని ప్రధాన కులాలను విభజించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని విమర్శించారు.
Tirupati News : రాజ్యాంగాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అవమానించే విధంగా తిరుపతి ఎంపీ ఉపఎన్నికల నుంచి నేటి ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు బస్సులలో దొంగ ఓటర్లను తీసుకువచ్చి వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తూ వస్తుందని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. పసుపులేటి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ రాజకీయాన్ని నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజించు పాలించు అనే సూత్రాన్ని బ్రిటీష్ వారి నుంచి సంక్రమించినట్లు, వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని ప్రధాన కులాలను విభజించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని ఆరోపించారు. స్మార్ట్ సిటీ అవార్డులు తిరుమల, తిరుపతికి వచ్చిందని గొప్పలు చెప్పుకునే పాలకులు, చెత్త పన్ను వసూలు చేస్తూ ఎక్కడ అడుగుపెట్టినా చెత్తమయం చేశారన్నారు.
తిరుపతి మాస్టర్ ప్లాన్ వెనుక పెద్ద స్కామ్
తిరుమలలో లీటర్ నీరు 60 రూపాయల(బాటిల్) చొప్పున విక్రయిస్తున్నారని, ఈ బాటిల్స్ వ్యాపారం వెనుక ఏ బడా బాబు లబ్ధి పొందుతున్నారో అందరికీ తెలుసని హరిప్రసాద్ అన్నారు. అలాగే తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లు వెనుక ఎంత పెద్ద స్కామ్ దాగి ఉందో బయటపెడతామని హెచ్చరించారు. తమ "జనసేనాని" కుల మతాలకు అతీతంగా రాజకీయం చేయాలని పాలకులను మచిలీపట్నం సభలో హెచ్చరించారన్నారు. రాష్ట్ర ప్రజలలో మార్పు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని విన్నవించుకున్నారని, కక్ష, కుట్ర, కబ్జాలకు కేరాఫ్ గా ఉన్న వైసీపీను ప్రజలు క్షమించరాదన్నారు. కులాలకు అతీతంగా కలిసి కట్టుగా వైసీపీని తరిమి కొట్టాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు.
తిరుపతి అంటే దొంగ ఓట్లులా మారింది
"వైసీపీ నేతలు బ్రిటీష్ పాలనను మరిపిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు, ఏడు తరగతి చదివిన వాళ్లతో దొంగ ఓట్లు వేశారు. బీజేపీ నేత దొంగ ఓట్లను అడ్డుకున్నందుకు వైసీపీ నేతలు కులం పేరుతో దూషించారు. కోనసీమలో కూడా ఇలానే కులచిచ్చు పెట్టారు. వైసీపీ నేతలు శాశ్వత పదవులతో పుట్టారా? మీరంతా నియంతలా? రాజకీయం అందరి సొత్తని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అధికారాన్ని కొన్ని వర్గాలే చెలాయించాయి. అన్ని వర్గాలూ రాజకీయం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. మచిలీపట్నం సభలో కులాల ఐక్యతపై పవన్ చెప్పారు. ఏ కులం అయితే రాజ్యాధికారానికి దూరం అవుతుందో అది అంతరించింది పోతుందని అంబేడ్కర్ చెప్పారు. తిరుపతి అంటే దొంగ ఓట్లు వేస్తారని పేరు వచ్చింది. దీనిని ఎట్టిపరిస్థితిలో అడ్డుకుంటాం. ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వారికి అధికారం ఇచ్చేందుకు జనసేన ఉంది. కులాల పేరుతో దూషించిన వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి. బీజేపీ నేతలను కులాల పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. " - హరిప్రసాద్