Tirumala : త్వరలో అందుబాటులోకి శ్రీవారి మెట్టు మార్గం, ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభం : తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
Tirumala : తిరుమలకు భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా రావొచ్చని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తు్న్నామన్నారు. ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు.
Tirumala : కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని అందుకు తగిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా తిరుమలకు రావొచ్చని అన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుంచి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామని వివరించారు.
అన్నప్రసాద కౌంటర్లు పెంపు
ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాంభగీచా బస్టాండు, సీఆర్వో, ఏఎన్సీ తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పీఎసీ-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఇటీవల వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చాక దివ్యదర్శనం టోకెన్లు కేటాయిస్తామన్నారు.
గదులు 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయింపు
ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణ కట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని ధర్మారెడ్డి తెలియజేశారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని, రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వరకు 5,29,926 మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు. 24,36,744 లడ్డూలు, 25,921 వడలు విక్రయించామని తెలిపారు. 2,39,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 10,55,572 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. తిరుమలలో వివిధ విభాగాల్లో 1700 మంది, తిరుపతిలో 300, పరకామణి సేవ 200 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి వెల్లడించారు.