Mla Rohith Reddy : ఏపీలో సరైనా నాయకత్వం లేదు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Mla Rohith Reddy : ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఏపీలో సరైనా నాయకత్వం లేకే అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.
Mla Rohith Reddy : తిరుమల శ్రీవారిని తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని రోహిత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడాన్ని దేశ ప్రజలకు స్వాగతిస్తున్నారని అన్నారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన చర్చ జరుగుతుందని అన్నారు. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఏపీలో చాలామంది ఎక్స్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని త్వరలో అందరూ బీఆర్ఎస్ లో చేరతారని అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు. దొంగ కరెంటు తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని తమకు కేటాయించిన విద్యుత్ ను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
దొంగ కరెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు
"టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాగిస్తున్నారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏపీలో కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీలో బీఆర్ఎస్ చర్చ మొదలైంది. కేసీఆర్ పాలన ఏపీలో కూడా రావాలని కోరుకుంటున్నారు. ఏపీలో నాయకత్వ లోపం ఏర్పడిందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే భవిష్యత్ లో ఏపీలో కూడా బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. నిన్న ఏపీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ లోకి వస్తుంది. సిట్టంగ్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. చాలా మంది ఏపీ నేతలతో కేసీఆర్ గతంలో పనిచేశారు. వాళ్లంతా తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారు. ఏపీ అభివృద్ధిని తెలంగాణ అడ్డుకుంటుందనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఏపీలో సరైనా నేతలు లేకపోవడం వల్లే అందుకే అభివృద్ధిలో వెనకబడిపోతుంది. కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ అభివృద్ధి ముందుంది. అందుకు కేసీఆర్ నాయకత్వమే కారణం. దొంగ కరెంట్ తీసుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు."- రోహిత్ రెడ్డి
175 స్థానాల్లో పోటీ - మల్లారెడ్డి
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఆలోచనలో పడ్డారన్నారని మంత్రి మల్లారెడ్డి ఇటీవల అన్నారు. సీఎం కేసీఆర్ కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ, తెలంగాణ రెండూ ఒకేసారి విడిపోయాయని, ఏపీని కూడా తెలంగాణ లాగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏపీకి చెందిన ముప్పై శాతం ప్రజలు హైదరాబాద్ లోనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు అంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిది ఏళ్లు గడుస్తుందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. విభజనలో రకరకాల హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, స్పెషల్ స్టేటస్ మాటను మరిచిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వస్తే, విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తి అవుతుందన్నారు. కేవలం మూడేళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వక పోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేవలం కేసీఆర్ కే ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతామన్నారు. ప్రజల ఆదరణ వస్తుందని భావిస్తున్నామని, ఆంధ్రలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నా అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు.