YS Viveka Case : ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ డిస్మిస్ - వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం !
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అనుమానితుడిగా కాకుండా బాధితుడిగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. వైఎస్ వివేకా చనిపోయినట్లుగా తాను మొదట చూసి ఫిర్యాదు చేశానని.. మొదటి పిర్యాదు దారుడ్ని తానే కాబట్టి తనను బాధితుడిగా చూడాలని ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. అియతే ఆయనను సీబీఐ ఇటీవల అనుమానితునిగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంవీ కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి చనిపోయే వరకూ పీఏగా ఉన్నారు.
వివేకా హత్యపై పోలీసులకు తొలుత సమాచారం ఇచ్చింది కృష్ణారెడ్డికాబట్టి సెక్షన్ 173 ప్రకారం కాంపిటెంట్ పర్సన్‌గా గుర్తించాలని కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ేఅయితే కృష్ణారెడ్డిని సీబీఐ అనుమానితుడిగా చేర్చిందని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. గతంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వివేకా సతీమణి, కుమార్తె సునీతలను నిజమైన బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. బాధితులు ఎవరన్నదానిపై సుప్రీంలో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి హైకోర్టు తెలిపింది. హైకోర్టు నిర్ణయంతో ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.
ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ పై స్పష్టత ఇవ్వకుండా పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని ధర్మాసనం స్వతంత్రత కల్పించింది. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా... హైకోర్టు తగిన నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. లిఖితపూర్వక ఆదేశాలు గురువాం ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.
ఫిర్యాదుదారుగా కృష్ణారెడ్డి హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చని, కానీ ఆయన్ను సీబీఐ అనుబంధ చార్జిషీటులో అనుమానితుడిగా చేర్చినందున ఫిర్యాదుదారు హోదా కోల్పోయారని సునీతా రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఏ కేసులోనూ పిటిషనర్ కాని కృష్ణారెడ్డి అప్లికేషన్‌ను విచారిస్తే కోర్టుల్లో ఉన్న ఆయా పిటిషన్లపై ప్రభావం పడుతుందని సునీతా తరపు న్యాయవాదులు వాదించారు.