Police On Lokesh Padayatra : లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశం లేదు - నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్న పోలీసులు!
లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశంలేదని పోలీసులు ప్రకటించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామన్నారు.
Police On Lokesh Padayatra : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేష్ పాదయాత్రలో ఏర్పడిన ఉద్రిక్తతలు రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. పాదయాత్రకు వస్తున్న ఆదరణకు భయపడి పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. లోకేష్ యువగళం పాదయాత్ర అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులకు లేదని.. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నామని.. నంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ప్రకటించారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన వ్యవహరిస్తున్నామన్నారు. పాదయాత్ర ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి ఒత్తిడి లేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రవి ప్రకాష్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే పాదయాత్రపై ఆంక్షలు
పాదయాత్ర చేసుకునే హక్కు అందరికీ ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులకు అసలు లేదని చెబుతున్నారు. దిశ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తిరుపతి బాలాజీ కాలనీలోని పోలీసు క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను అనంతపురం రేంజ్ డిఐజీ రవిప్రకాష్ ప్రారంభించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రలో వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేయడంపై ఆయన స్పందించారు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే విధులను పోలీసు లంతా నిర్వర్తిస్తున్నామన్నారు.. పాదయాత్ర సమయంలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.. పాదయాత్రను ఆపాలంటూ ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.. అలాగే ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తును కల్పిస్తామని, అదేవిధంగా లోకేష్ కు అదే స్థాయి బందోబస్తును కల్పిస్తున్నట్లు అనంతపురం రేంజ్ డిఐజీ రవిప్రకాష్ తెలియజేశారు.
పోలీసుల తీరుపై టీడీపీ నేతల తీవ్ర విమర్శలు
గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేశారని... ఎవరినీ ఏ ముఖ్యమంత్రి అడ్డంకులు పెట్టలేదు. కానీ లోకేష్ పాదయాత్రకు ఎందుకింత భయపడి కండీషన్లు పెడుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రకు ముందే అన్ని అనుమతులు తీసుకున్నాం. కానీ ఏదోవిధంగా అడ్డుకోవాలని పోలీసులు సాకులు వెతుక్కొంటున్నారని అంటున్నారు. ఎవరి పాదయాత్రకూ లేని విధంగా లోకేష్ పాదయాత్రకు 39 నిబంధనలు పెట్టారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ జోడోయాత్రకు ఎలాంటి నిబంధనలూ పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టే ల కుట్ర రాజకీయాలు అర్థమవుతున్నాయంటున్నారు. పాదయాత్రను ఏదోవిధంగా అడ్డుకునేందుకు పోలీసులతో ప్రభుత్వం కుట్రలు చేయిస్తోందన్నారు.
వివేకా హత్య కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపణలు
వివేకానందరెడ్డి హత్య కేసులో భారతీరెడ్డి పీఏ నవీన్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ వ్యూహంలో భాగంగానే వివేకా హత్య జరిగిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని దారి మళ్లించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా మేరుకు పోలీసులు పాదయాత్రను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రజాస్వామ్యంలో ఉద్యమాలు, యాత్రలు జరుగుతాయి. శాంతియుతంగా జరిగే పాదయాత్రను అడ్డుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల్ని కొట్టారని నమ్మించడానికి వారి చొక్కాలు వారే చింపుకున్నారు. చట్ట ప్రకారం పోలీసులు చేయాలి. రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి పాదయాత్రకు చంద్రబాబు అడ్డంకులు సృష్టించలేదు. అరాచక రాజకీయాలు నడుస్తున్న తరుణంలో యువతకు లోకేష్ అండగా వస్తున్నారు. ప్రభుత్వ కుట్రలు చూస్తుంటే లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం భయపడుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను కరెక్ట్ కాదని... పోలీసులు ఖండించారు.