BJP Fire : ప్రజాపోరు సభలకు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు - ప్రచారవాహనానికి నిప్పు పెట్టడంపై ఏపీ బీజేపీ ఆగ్రహం !
ఏపీ బీజేపీకి చెందిన ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
BJP Fire : గుంటూరు జిల్లా తెనాలిలో బీజేపీ ప్రజాపోరు ప్రచార వాహనానికి కొంత మంది దుండగులు నిప్పు పెట్టడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ప్రజాపోరు సభలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వాహనాలతో ప్రచారం చేస్తోంది. తెనాలి నియోజకవర్గంలోనూ ఈ ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. అయితే రాత్రి సుల్తానాబాద్ సమీపంలో పార్క్ చేసిన వాహనాన్ని కొంతమంది దుండగులు టార్గెట్ చేశారు. ఎవరూ లేని సమయం చూసి నిప్పు పెట్టారు. వాహనం తగలబడుతున్న సమయంలో స్థానికులు చూసి బీజేపీ నేతల్ని అప్రమత్తం చేశారు. దాంతో వారు మంటల్ని ఆర్పివేశారు.
ఈ ఘటన తెనాలి నియోజకవర్గంలో కలకలం రేపింది. బీజేపీ ముఖ్య నేతలు వచ్చి కాలిపోయిన ప్రచార వాహనాన్ని పరిశీలించారు. పోలీసులు కూడా వివరాలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరన్నది మాత్రం తెలియలేదు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి లో బీజేపీ ప్రజాపోరు ప్రచార రథాన్ని తగలపెట్టడంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అర్ధరాత్రి బిజెపి ప్రజా పోరు రథం తగలబెట్టినంతమాత్రాన ప్రజల హృదయాల్లో ఉన్న బీజేపీని నరేంద్రమోడీని ప్రజల నుంచి దూరం చేయలేరని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యనించారు. ఇది పిరికిపంద చర్య, సంఘటనకు పాల్పడిన వ్యక్తులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అధికార పార్టీ నేతలు కి కొందరు పోలీసులు ఐపీసి ని వైసిపీ గా మార్చారని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు.
తెనాలిలో అర్ధరాత్రి బిజెపి ప్రజా పోరు రథం తగలబెట్టినంతమాత్రాన ప్రజల హృదయాల్లో ఉన్న బీజేపీని నరేంద్రమోడీని ప్రజల నుంచి దూరం చేయలేదు.ఇది పిరికిపంద చర్య, సంఘటనకు పాల్పడిన వ్యక్తులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 30, 2022
డిమాండ్ చేస్తుంది .#PrajaPoru @BJP4Andhra @dgpapofficial pic.twitter.com/luWi7GC7ne
దాడులు చేయడం , బీజేపీ వాహనాలకు నిప్పు అంటించడం ద్వారా బీజేపీని నైతికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ డీజీపీ ఈ ఘటనపై స్వయంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు బీజేపీ సభలు కు వస్తున్న వారికి సంక్షేమ పధకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని.. కొందరు పోలీసులు అనుసరిస్తున్న తీరు సిగ్గు చేటని విమర్శించారు. రామతీర్థం, అంతర్వేది ఘటన లలో ఎందుకు అరెస్ట్ చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారని.. ఇలాంటి దుశ్చర్యలపై ఎందుకు అరెస్టులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
175 సీట్లు గెలుస్తామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారని.. రాష్ట్రంలో ఎవరు ఆనందంగా ఉన్నారని మీరు 175 సీట్లు గెలుస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కావాలని రాష్ట్రంలో బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రైల్వే జోన్ అంశంపై వివరణ ఇచ్చినా అదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.