YS Viveka Case : 6 రోజులు కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి - బుధవారం నుంచి ప్రశ్నించనున్న సీబీఐ !
వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు ఆరు రోజుల కస్టడీకి అంగీకరించిది కోర్టు. బుధవారం నుంచి వారిని ప్రశ్నించనున్నారు.
YS Viveka Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి చంచల్ గూడ జైలులో వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 24 తేదీ వరకు అనుమతి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తి భాస్కర్ రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించింది. భాస్కర్ రెడ్డి పారిపోతాడని భావించి ముందే అరెస్ట్ చేశామని వెల్లడించింది. అతడు విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని, కీలకసాక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరించింది . విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడంలేదని, విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. వివేకాపై భాస్కర్ రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని, 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉందని తెలిపింది. ఈ మేరకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కారణాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డిది కీలకపాత్ర అని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నెల ముందే వివేకా హత్యకు కుట్ర పన్నారని, భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర జరిగిందని వివరించింది. సీఐ శంకరయ్యను భాస్కర్ రెడ్డి బెదిరించారని తెలిపింది. వివేకా హత్యలో సహనిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందిందని వెల్లడించింది.
ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లోనూ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించినట్లు పేర్కొంది. హత్య అనంతరం ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ ప్రయత్నించినట్లు వెల్లడించింది. హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ ఉదయం 4 గంటలకే ఇంటినుంచి వెళ్లాడు. ఆ రోజు మెుత్తం.. ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య తర్వాత.. ఆధారాల చెరిపివేతకు ఎదురు చూశారన్నారు. హత్య జరిగిన స్థలంలోనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించామని సీబీఐ తెలిపింది.
ఆరు రోజుల పాటు కస్టడీలో వీరిద్దరి నుంచి కీలకమైన వివరాలను సీబీఐ అధికారులు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీబీఐకి ఇప్పటి వరకూ దొరికిన ఆధారాలను చూపిస్తూ వారిని ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు.