Revanth Calls Chandrababu: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్, అఖండ విజయంపై శుభాకాంక్షలు
Revanth Reddy News: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిన సందర్భంలో విభజన అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించుకుందామని రేవంత్ చెప్పినట్లు సమాచారం.
Chandrababu Revanth Reddy News: టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీలో టీడీపీ 130కి పైగా సీట్లు సాధించడం పట్ల రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని కోరారు. త్వరలోనే ఏపీ - తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరినట్లు తెలిసింది.
అయితే, తాను చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతిస్తే తప్పకుండా ఆ కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు నిన్న (జూన్ 5) విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఏపీలో జూన్ 4న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 135 సీట్ల భారీ మెజారిటీని సొంతంగా సాధించిన సంగతి తెలిసిందే. జనసేన కూడా 21 స్థానాలతో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచింది. వైఎఎస్ఆర్ సీపీ 11 చోట్లకే పరిమితం అయింది. బీజేపీ మాత్రం 8 స్థానాల్లో గెలిచింది. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో కూటమి భారీ మెజారిటీలో ఉండడంతో 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.