Amaravati Capital Case: అమరావతి అన్ని కేసులపై సుప్రీంలో నేడు విచారణ, మొత్తం ఎన్ని అంటే?
Amaravati Capital Case: అమరావతి రాజధాని అన్ని కేసులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అలాగే రాష్ట్ర విభజన కేసులతో కలుపుకొని మొత్తం 35 కేసులు దాఖలు కాగా.. నేడు విచారించనున్నారు.
Amaravati Capital Case: సుప్రీంకోర్టులో నేడు అమరావతి రాజధాని కేసుల విచారణతోపాటు రాష్ట్ర విభజన కేసులు కూడా విచారించబోతున్నారు. అయితే రెండు అంశాలపై మొత్తం 35 కేసులు నమోదు కాగా.. వీటిని జస్టిస్ కే.ఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధాని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్ లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధానిని నిర్ణించుకునే సంపూర్ణ అధికారం ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ.. చట్టానికి తప్పుడు అర్థాలు చెబుతున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం, రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇటీవలే అమరావతి భూములపై హైకోర్టు స్పందన..
అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీళ్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్ట నిబంధనల మేరకు 5 శాతం భూమిలోనే ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదపు ఏజీ(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. రాజధాని అమరావతిలో రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని భూసమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం పానకాల రెడ్డి, రైతు ఎ. నందకిశోర్ వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం అందరికీ తెలిసిందే. వీటిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
భూములపై హక్కులు కోల్పోవానికి రైతులు అంగీకరించారు...
రాజధాని అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. సీఆర్డీఏతో జరిగిన ఒప్పంద ప్రకారం భూములపై హక్కులను కోల్పోవడానికి రైతులు అంగీకరించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని కోరే హక్కు మాత్రమే వారికి ఉంటుంది. రైతులకు ప్లాట్లు ఇచ్చాకే రాజధానిలో భూమిని ఇతర నిర్మాణాల కోసం వినియోగించాలంటే ఎలా, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలు ఇప్పటికే జరిగాయి. హ్యాపీనెస్ట్ పేరుతో ఉన్నత వర్గాల కోసం ఇళ్ల ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఏ ఒక్కరూ అభ్యంతరం తెలపలేదు అని గుర్తు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అమరావతిని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధ చేసేందుకు సీఆర్డీఏకు చట్టబద్ధత కల్పించి, భూములను సమీకరించారని ఈ క్రమంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీళ్లేదని పిటిషనర్లు చేస్తున్న వాదనలకు మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఆర్డీఏ, ప్రభుత్వం రెండూ వేర్వేరు అని తెలిపారు. నిర్ధిష్ట అవసరం కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీళ్లేదని వివరించారు.