Supreme Court : కడప కోర్టు ఆదేశాలపై స్టే - షర్మిల, సునీతల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
YS Viveka Case : వివేకా హత్యపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Andhra News : వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది.
కడప కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందన్న సుప్రీంకోర్టు
హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేయాలంటూ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌పై కడప కోర్టు విచారణ జరిపి ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కడప కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ అంశంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
కోర్టు ధిక్కరణ జరిమానా కూడా విధించిన కడప కోర్టు
బాబాయ్ వివేకా కేసుపై ప్రచారం చేయకూడదని కడప కోర్టు సునీత, షర్మిలను ఆదేశించింది. దాంతో కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఆపై సునీత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కడప కోర్టులోనే తేల్చుకోవాలని వారికి హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న కడప కోర్టు.. షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిలకు రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు. జిల్లా లీగల్ సెల్‌కు జరిమానాను కట్టాలని సూచించింది. ఈ కేసులపైనా సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఎన్నికల్లో ప్రచారాంశం అయిన వైఎస్ వివేకా హత్య కేసు
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి టికెట్లు సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని షర్మిల (YS Sharmila), సునీత పలుమార్లు వ్యాఖ్యానించారు. నేరస్తులను అసెంబ్లీ, పార్లమెంట్ లకు పంపించవద్దంటూ సైతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనంగా మారింది.