Polavaram Supreme Court : ఎన్జీటీ విధించిన జరిమానా చెల్లించాల్సిందే - ఏపీ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు !
ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందున ఎన్జీటీ విధించిన జరిమానాను కట్టాల్సిందేనని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Polavaram Supreme Court : పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘలను ధృవీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. జరిమానా చెల్లించకపోవడంపై సీరియస్ అయింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ ఏమీ దానం కాదని వ్యాఖ్యానించింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పర్యావరణ ఉల్లంఘలను ధృవీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు వ్యయం ఆధారంగా గతంలో రూ. 242 కోట్లు ఎన్జీటి పెనాల్టీ విధించింది. అనంతరం ఎన్జీటి తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. నిపుణుల కమిటీ ధృవీకరించిన జరిమానా రూ.24 కోట్లను చెల్లించాల్సిందేనని 17 అక్టోబర్ 2022న ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలను జారీచేసింది.ఇక రూ.242 కోట్లు పెనాల్టీ విధించాలా? లేదా? అన్నదానిపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది.
గతంలోనే ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి.. పోలవరంలో భాగమైన ప్రాజెక్టులని ఏపీ ప్రభుత్వం వాదించింది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులని అంటోంది. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై విచారణ జరుపుతోంది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమం అని గతంలోనే ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగం కాదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటీకి చెప్పింది. దీంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని... జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినందుకు గాను జరిమానా, పరిహారం అంచనాపై కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది.ఆ కమిటీ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పరిశీలించింది. చివరికి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.