Supreme Court : ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు - ఏ కేసులో అంటే ?
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది. సిబిఐ కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును శ్రీలక్ష్మి ఆశ్రయించారు. ఆమె పిటీషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది నవంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు
కేసులు నమోదు చేయడానికి కారణాల్లేవన్న హైకోర్టు
ఓఎంసీ కేసులో ఏపీ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేయడానికి కారణాల్లేవని హైకోర్టు వెల్లడించింది. శ్రీలక్ష్మిపై ఐపీసీ 120బి రెడ్ విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(డి) కింద అభియోగాలను నమోదు చేయడానికి ఎలాంటి కారణాల్లేవని పేర్కొంది. అందువల్ల ఓఎంసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఈ అభియోగాల నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇతర నిబంధనల కింద అభియోగాలను నమోదు చేస్తే విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. ఓఎంసీ కేసులో తనను డిశ్ఛార్జి చేయాలన్న పిటిషన్‌ను కొట్టేస్తూ అక్టోబరు 17న సీబీఐ ప్రధానకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శ్రీలక్ష్మి హైకోర్టులో సవాలు చేశారు. ఓఎంసీకి క్యాప్టివ్ మైనింగ్ కింద లీజులు కేటాయించడానికి వీలుగా 20కి పైగా దరఖాస్తులను తిరస్కరించారని సీబీఐ ఆరోపించింది. పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందాలని సీబీఐ తెలిపింది.
2011లో అరెస్టు, ఏడాది జైలులోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007-2009 మధ్య కాలంలో శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. అదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.80 లక్షలు లంచం తీసుకుని అనుమతులు ఇచ్చారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. అలా ఆమె 2011లో అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ 2012లో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సమయంలో శ్రీలక్ష్మి ఏడాది పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆ అరెస్టు ఘటనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీలక్ష్మిని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 2, 2013న చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఆమె విడుదల అయ్యారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ నిందితురాలు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అక్రమాస్తులపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులకుగానూ రెండు కేసుల్లో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. దాల్మియా సిమెంట్స్‌లో 5వ నిందితురాలు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన 13(2)రెడ్ విత్ 13(1)(సి), (డి)ల కింద విచారణను కొనసాగించవచ్చంది. దీంతోపాటు పెన్నా సిమెంట్స్‌కు కర్నూలులో లీజు మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అదనపు అభియోగపత్రం దాఖలు చేస్తూ 15వ నిందితురాలిగా పేర్కొంది. కర్నూలు జిల్లాలో 304.74 హెక్టార్ల లీజు మంజూరులో అల్ట్రాటెక్ దరఖాస్తును తిరస్కరించి పెన్నాకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.