Supreme Court : అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా ?
Andhra Pradesh : జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వెంటనే ప్రారంభించాలని సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణలో కాలయాపనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Jagan Illegal Assets Cases : జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు.. సీబీఐ కోర్టును ఆదేశించింది. రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుపై జరుగుతోన్న విచారణలో కాలయాపనపై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఆఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అనేలా కాలయాపన చేస్తున్నారని.. ట్రయల్స్ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని.. ఇదే విచారణలో జాప్యానికి కారణం అవుతుందని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు, పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వట్లేదని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికి 39 క్వాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని ఈ పిటిషన్లపై తీర్పులు ఇచ్చేలోపే జడ్జీలు బదిలీ అవుతున్నారని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది. ఈ కేసులో ఉన్న నిందింతులంతా శక్తిమంతులే అని సీబీఐ తెలిపింది. మొత్తంగా క్వాష్ పిటిషన్లపై విచారణ సమయంలోనే ఆరుగురు జడ్జిలు మారిపోవడం, రిటైర్ కావడం జరిగిందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. దీంతో.. డిశ్చార్జ్ పిటిషన్లకు.. అసలు కేసుల ట్రయల్‌కు సంబంధం లేని వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిది. తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3 వేల సార్లు వాయిదా వేసిందని జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కోరారు.
రఘురామ పిటిషన్లపై గతంలో విచారణ జరిపినప్పుడే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు నేరుగా సీబీఐ కోర్టుకు... సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ ప్రారంభమయ్యే అవ కాశాలు ఉన్నాయి. అదే జరిగితే జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేసి పన్నెండేళ్లు దాటినా న్యాయవ్యవస్థలో ఉన్న అవకాశాల్ని ఆధారంగా చేసుకుని ట్రయల్ ప్రారంభం కాకుండా పిటిషన్లు వేస్తున్నారన్న ఆరోపణలను సీబీఐ చేస్తోంది.