SC on AP Govt: సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది- ఆసక్తిగా చూస్తోన్న టీడీపీ, వైసీపీ!
SC on AP Govt: అమరావతి భూములు, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే మూడు రోజుల్లో ఈ విషయాలపై తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
SC on AP Govt: ఏపీ ప్రభుత్వంపై సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. టీడీపీ హయాంలో అమరావతి భూములు, ఫైబర్ నెట్ కుంభకోణాలు జరిగాయంటూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్టేపై పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఇరు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి భూములు, ఫైబర్ నెట్ కుంభకోణాలకు సంబంధించిన సిట్ విచారణకు సంబంధించిన విషయం బంతి ఇప్పుడు సుప్రీం చేతికి చేరింది. రెండు, మూడు రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టుకు ఇచ్చే తీర్పు సంచనలనంగా మారనుంది.
సుప్రీంకోర్టు కీలక తీర్పుపై ఉత్కంఠగా ఇరుపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఎవరికీ అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. విచారణ సమయంలో జస్టిస్ ఎం.ఆర్.షా జస్టిస్, ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాదిపై సీరియస్ అయింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా అని ప్రశ్నించింది. రాజకీయ వైరం వల్ల విచారణ చేయొద్దంటే ఎలా, క్లీన్ గా ఉంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. అలాగే సిట్ లో అంతా పోలీసు అధికారులే ఉన్నారు కదా అని చెప్పుకొచ్చింది. కాగా కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకే ఓ పోలీసు స్టేషన్ లో సిట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకు తెలిపారు.
గత ప్రభుత్వంపై పక్షపాతంతోనే ఆ అంశాలపై జీవో ఇచ్చారంటూ వర్ల రామయ్య తరఫు న్యాయవాది దవే వాదనలు వినిపించారు. అధికార పార్టీతో నిజ నిర్దారణ ఏర్పాటు చేయడంతోనే హైకోర్టు కల్గజేసుకుందని చెప్పారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ ఇరు పక్షాల్లో నెలకొంది.
12 సెప్టెంబర్ 2021న కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ కు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తొలిదశ టెండర్లలో అక్రమాల జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ గతేడాది సెప్టెంబర్ 12న కేసు నమోదు చేసింది. టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్, టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణకు అర్హతలు లేకున్నా టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా రూ.321 కోట్లకు కాంట్రాక్టు అప్పగించారని పేర్కొంది. ఈ మేరకు టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ ప్రస్తావించింది.
తొలిదశ టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ జులై 16న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ ప్రాథమిక విచారణ చేపట్టి 774 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెప్టెంబర్ 9న కేసు నమోదు చేసింది. పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. మొత్తం 19 మందిని కేసులో నిందితులుగా పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలిందని ఒక నివేదిక సిద్ధం చేసింది. నిబంధనలను విరుద్ధంగా టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించి, నకిలీ పత్రాలతో టెండర్లు ఫైనల్ చేసినట్లు సీఐడీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నిపుణుల అభ్యంతరాలను పక్కన బెట్టి రూ.321 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారని తెలిపింది. పరిశీలన చేయకుండా పరికరాల కోసం రూ.120 కోట్లు చెల్లించినట్లు తేల్చింది.