Lokesh Tour: పలాసలో టెన్షన్ టెన్షన్, లోకేశ్ పర్యటనతో భారీగా పోలీసుల మోహరింపు!
Lokesh Tour : నేడు పలాసలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. అలాగే టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో పలాస ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Lokesh Tour: పలాసలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది. వాణిజ్య కేంద్రమైన జంట పట్టణంలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూదందాపై గత వారం రోజులుగా అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇంఛార్జీ గౌతు శిరీష మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇది వరకే ప్రకటించారు. ఇంతలో శ్రీనివాస నగర్ కాలనీ వివాదం తెరపైకి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేశాయి. ఓవైపు మంత్రి అప్పలరాజు ఆ వార్డులోని కౌన్సిలర్ సూర్య నారాయణ ఇళ్లను తొలగిస్తామంటూ హెచ్చరించడం, ఆయనకు అండగా టీడీపీ అధిష్టానం సైతం నిలవడంతో అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఓవైపు వైసీపీ పిలుపు, మరోవైపు లోకేష్ పర్యటన..
ఆదివారం ఓవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారమే పలాస పర్యటన ఖరారు చేశారు. జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు వివాహానికి వస్తున్న లోకేష్.. పలాస కూడా వెళ్లి అక్కడి కౌన్సిలర్ సూర్య నారాయణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఆ పట్టణానికి చేరుకున్నారు. శుక్రవారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిరీషను లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డు కుని వెనక్కి పంపించిన విషయం విదితమే. శనివారం మరలా ఎంపీ, శిరీష వెళ్లి మీడియా సమావేశంలో పాల్గొని అధికార పక్షాన్ని, మంత్రి అప్పలరాజును దుయ్యబట్టారు. రాజకీయ పోరులో తగ్గేదేలే అన్నట్టుగా సవాళ్లు విసురుకుంటున్నారు.
అధికారులు ఆ కాలనీ విషయం తేల్చాల్సిందిపోయి ఆ పార్టీ నేతలే స్వయంగా రంగ ప్రవేశం చేసి అప్పల సూర్యనారాయణ ఇల్లును కూలదోయడమే లక్ష్యంగా ప్రకటనలు చేయడం ఓవైపు చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు మంత్రి అప్పలరాజుపై కూడా టీడీపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలను ప్రతిష్టా త్మకంగా తీసుకుని తమ పవర్ ఏమిటో చూపి స్తామన్న ధోరణిలో వైసీపీ శ్రేణులు ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎలా గడుస్తుందోనని జంట పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.
పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం..!
పలాస కాశీబుగ్గ పట్టణంలో రాజకీయ వేధింపులు, కక్ష సాధింపునకు మంత్రి అప్పలరాజు వ్యవహారం మారిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు దుయ్యబట్టారు. పలాసలోనే కాకుండా విశాఖ తదితర ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతల కార్యాలయాలు, ఇళ్లను తొలగించేందుకు అర్థరాత్రి యంత్రాంగం చర్యలు చేపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల తొలగింపులకు వస్తుండగా అక్కడ పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలని తనదైన శైలిలో సూచించారు. తన నియోజకవర్గ పరిధిలో కూడా పర్యటనను అడ్డుకోవడం ఇదెక్కడి చట్టమని విమర్శించారు. పోలీసుల గౌరవం పెరిగే విధంగా వ్యవహరించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. పలాస టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన పరిధిలోని ఓ ప్రాంతంలో ఏర్పడిన సమస్య పూర్వాపరాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే, ప్రజా ప్రతినిధినైన తనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ నాయకులే టార్గెట్ గా స్థానిక మంత్రి దొడ్డి దారిలో అధికారులను అడ్డంగా పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ ఆరోపించారు.
వాళ్ల వల్లే ఓ వృద్ధురాలు మరణం..
ఈ నేపథ్యంలో శ్రీనివాసనగర్ లోని అంశాన్ని ప్రస్థావిస్తూ జేసీబీలతో అక్కడికి వచ్చి వీరంగం సృష్టించారని, దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఓ వృద్ధురాలు గుండెపోటుతో మరణించిందని తెలిపారు. ఎవరు ప్రశ్నిస్తే వారిళ్లపైకి మంత్రి సీదిరి జేసీబీలను పంపిస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీ నాయకుల అణచివేతకు ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకువచ్చారా అని మండి పడ్డారు. ముందుగా తామడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, డైవర్షన్ పొలిటిక్స్ ప్లే చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీనివాసనగరలో ఏళ్ల తరబడి నివాసముంటున్నారని, పూరి గుడిసెల నుంచి భవనాలు నిర్మించుకున్నామని, మహిళలు, వృద్ధులు తన దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇన్నేళ్ల పాటు యంత్రాంగం పట్టించుకోకుండా తాజాగా సూర్యనారాయణ ఇంటిపై దృష్టి సారించడం పట్ల రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు. మంత్రి అప్పలరాజు ప్రజలను భయాందోలనకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు.