Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Minister Dharmana Prasadarao : చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తొలగించేది వాలంటీర్లనే అని, అందుకు ముందే వాలంటీర్లే తుపాకీ పేల్చాలని మంత్రి ధర్మాన సూచించారు.
Minister Dharmana Prasadarao : చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల పైనే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మొదట వాలంటీర్లనే తొలగిస్తారన్నారు. అయితే చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మే 17కి పూర్తి స్థాయిలో వంశధర నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ వాళ్లు ప్రజల డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. ధరలు అన్ని దేశాల్లో పెరిగాయని, ప్రతిపక్షాల ఆరోపిస్తున్నట్లు ఏపీలో మాత్రమే ధరలు పెరగలేదన్నారు. భూ యజమానుల మధ్య తగాదాలు లేకుండా పరిష్కరించేందుకు భూసర్వే చేస్తున్నామన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాడానికి ఏదో ఒకటి చేస్తుంటారన్నారు. ప్రజలు మధ్యలో పాలన జీవితం వేరు సినిమా యాక్షన్ వేరని పవన్ కల్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారన్నారు. సన్నిహిత సంబంధాలను ఉపయోగించి వాలంటీర్లు ఏ మంచి జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఏది మంచి ప్రభుత్వం అని చెప్పే హక్కు వాలంటీర్లకు ఉంది. చంద్రబాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటర్ల పైనే అన్నారు. చంద్రబాబు కన్నా ముందే మనం తుపాకీ పేల్చాలని సూచించారు. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటు వెయ్యాలో చెప్పొద్దనే మాట ఎవరన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. పౌరులకు ఉండే హక్కులన్నీ వాలంటీర్లకు ఉంటాయన్నారు.
ఏ రాజకీయ పార్టీకి ఓటు వెయ్యాలో వాలంటీర్లు చెప్పండి
"వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నారు. ఏం మంచి జరుగుతుందో మీకు కేటాయించిన కుటుంబాలకు చెప్పండి. ప్రజలు అమాయకత్వంగా ప్రతిపక్ష పార్టీలు చెప్పిన మాటలు నమ్మేస్తారు. మీరు వాళ్లను ఎడ్యుకేట్ చేసి వాళ్లను రైట్ డైరెక్షన్ వైపు తీసుకెళ్లాలి. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటు వెయ్యాలో, ఏ రాజకీయ పార్టీ మంచిదో చెప్పకూడదని ఎవరు చెప్పారు. వాలంటీర్లకు హక్కులున్నాయి. ఓ మంచి ప్రభుత్వం గురించి చెప్పే హక్కు వాలంటీర్లకు ఉంటుంది. మీరు భయపడకండి. ప్రతిపక్షాలు చెప్పొదంటూరు. ప్రతి వాలంటీర్ వారికి కేటాయించిన 50 కుటుంబాలతో మాట్లాడండి. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైరింగ్ వాలంటీర్లపై ఉంటుంది. చంద్రబాబు కన్నా ముందే మనమే పేల్చేస్తే సరి. ఇప్పుడు మన దగ్గర తుపాకీ ఉంది. టీవీ, పేపర్లు చూసి ఏదో జరుగుతుందని అనుకోకండి. వైసీపీ ప్రభుత్వం నీ కుటుంబానికి చేసే సాయం గుర్తుంచుకోండి. మీ కుటుంబం ముందుకు సాగుతుందంటే సీఎం జగన్ కారణం. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామాల్లో చైతన్యవంతం అవ్వాలి. " - మంత్రి ధర్మాన ప్రసాదరావు
వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ఈ వ్యవస్థను రూపొందించింది. వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తారని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అయితే వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నారని ఆరోపిస్తున్నాయి. మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వాలంటీర్లకు ఎన్నికల విధులు కేటాయించవద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.