Chittoor: అంగన్‌వాడీ పౌష్టికాహారం ప్యాకెట్‌లో పాము కళేబరం-షాకైన గర్భిణి-అధికారులకు ఫిర్యాదు
ఏపీలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలకు ఇచ్చే పౌష్టికారం ప్యాకెట్‌లో పాము కళేబరం కనిపించింది. ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం చూసి షాకయిన గర్భిణి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
గర్భిణిలకు పౌష్టికాహారం అందిస్తే.. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం బాగుంటుందన్న సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం అంగవాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరఫరా చేస్తోంది. గ్రామాల్లోని గర్భిణీ మహిళలు ఆ పౌష్టికాహార ప్యాకెట్లు నెల నెలా తీసుకుంటారు. కానీ... పౌష్టికాహార ప్యాకెట్లలో పాము కళేబరం రావడం కలకలం రేపుతోంది. ఇలాంటివేనా గర్భిణిలకు ఇచ్చేది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి తింటే... గర్భిణిలు, వారి కడుపులోని పిల్లల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..?
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీలోని శాంతినగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం ఉంది. మానస అనే గర్భిణి ఆ అంగన్‌వాడీలో ఇచ్చిన పౌష్టికాహారం కిట్ తీసుకుంది.ఆ తర్వాత శ్రీమంతం కోసం పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక... అంగన్‌వాడీలో ఇచ్చిన పౌష్టికాహార కిట్‌లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్ తెరిచింది. ఆ ప్యాకెట్‌లో పాము కళేబరం ఉండటం గమనించి షాకయ్యింది. ఈ విషయాన్ని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కళ్యాణికి ఫోన్ చేసి చెప్పింది. ఫొటోలు కూడా తీసి పంపింది. కళ్యాణి సాయంతో ఉన్నతాధికారి అయిన సీడీపీవో వాణిశ్రీ దేవికి ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఉన్నతాధికారులు... పౌష్టికాహారం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్నమాట వాస్తవేమని అంగీకరించారు. ఈ ఘటన గురించి పైఅధికారులకు చెప్పామన్నారు. మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆ అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకున్న గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు. తెలియక తినేసి ఉంటే... పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పౌష్టికాహారం ఇవ్వడం కాదు.. శుభ్రద, క్వాలిటీ కూడా పాటించాలని సూచిస్తున్నారు.
పౌష్టికాహారం ప్యాకెట్‌లో పాము కళేబరం వచ్చిన ఘటనపై విచారణ జరపబోతున్నారు అధికారులు. అలా ఎలా జరిగింది అనే కోణంలో ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకోబోతున్నారు..? ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అధికారులు ఎన్ని చెప్పినా.. గ్రామస్తుల్లో మాత్రం భయం పోవడంలేదు. గర్భిణీలు ఇచ్చే పౌష్టిహారంలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి ఫుడ్ తిని... కడుపులోని పిల్లల ఆరోగ్యాలకు ఫణంగా పెట్టలేమని వాపోతున్నారు.