APSRTC And TS RTC : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కార్మికులకు మేలేనా ? ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు లబోదిబోమంటున్నారు ?
ఆర్టీసీ ఉద్యోగుల్ని ఏపీ ప్రభుత్వం విలీనం చేసుకుంది. కానీ వారు సంతృప్తిగా లేరు. మరి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సంతృప్తి చెందుతారా ?
APSRTC And TS RTC : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేశారు. దీంతో అక్కడ ఉద్యోగులకు మేలు జరిగిందా లేదా అన్న చర్చ ప్రారంభమయింది. మరి ఏపీలో ఉద్యోగులకు మేలు జరిగిందా ? విలీనం వల్ల తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరుగుతుందా ?
నిరాశలో ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విలీనం తరువాత ఎలా ఉంది..కార్మికులు ఫుల్ ఖుషీనా.. శాలరీలు ఎలా ఉన్నాయి.. ఈ విషయాలను గురించి కార్మికులను ప్రశ్నిస్తే దిమ్మ తిరిగే విషయాలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్దలో విలీనంత తరువాత పరిస్దితులు పై కార్మికుల నుండి షాకింగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. సీనియర్లను కాదని, జూనియర్లకు శాలరీల పెంపుదల చేయటం పై వారు మండిపడుతున్నారు. అదేం లెక్కంటే అధికారులు నోరు మెదపటం లేదని గుర్రుగా ఉన్నారు. విలీనం అయిన సంతోషం లేదంటున కార్మికుల వర్గాలు.
అనుకున్నదొకటి... అయ్యిందొకటి...!
కొర్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత తాము మరింతగా వెనుకబడిపోయామని ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే గత తెలుగు దేశం ప్రభుత్వం హామీ ఇచ్చి కూడ అమలు చేయకపోవటంతో అదే హామిని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నట్లుగానే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేసింది. దీంతో ఈ ప్రభావం అటు తెలంగాణా పై కూడా పడింది. ఆర్టీసీ లో విలీనం సాధ్యం కాదని గతంలో ప్రకటన చేసిన తెలంగాణా సీఎం కేసీఆర్, కార్మికుల డిమాండ్ మేరకు తెలంగాణా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనం తరువాత మీరు ఎలా ఉన్నారంటూ ఏబీపీ దేశం పలకరించిందే తడవు... కార్మికుల తమ సమస్యలను ఎకరవు పెట్టారు. చివరకు వైసీపీ అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ లో విలీనం తరువాత తమ పరిస్దితి వెనుకబడినట్లుగా అయ్యిందని మిగిలిని కార్మికులు అంటున్నారు. సీనియారిటి, జూనియర్ అనే అంశాలను పక్కన పెట్టి నిన్న కాక మెన్న ఉద్యోగంలో చేరిన వారికి పది వేల రూపాయలకు పైగా జీతాలు పెంచారని, తమకు మాత్రం కేవలం 3వేల రూపాయలు పెంచారని అంటున్నారు. అదేమంటే, అదికారులు స్పందించటం లేదని చెబుతున్నారు.
కార్పొరేషన్‌లోనే ఉంటే బాగుండేదన్న భావనలో ఉద్యోగులు
అంతే కాదు ప్రభుత్వం లో విలీనం అయిన సంతోషం కార్మికుల్లో లేదని, ప్రదానంగా వైద్య సదుపాయం లేకుండాపోవటంతో పరిస్దితి ఆగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. కార్పొరేషన్ లో ఉండగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చు అయినా భరించే వారని, అయితే ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత, ప్రైవేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ పై సదుపాయాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నాయని అంటున్నారు. దీని వలన కార్మికులు అనారోగ్యం బారినపడి .. సర్వం పోగొట్టుకుంటున్నారని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత అక్కడ కార్మికులు సంబరాలు చేసుకుంటున్న నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ లో విలీనం తరువాత కార్మికుల అవస్దలు చెప్పుకోవటం విశేషం.. అధికారులకు ప్రభుత్వం నుండి సరైన ఆదేశాలు ఇచ్చి, పర్యవేక్షణ చేస్తే పరిస్దితుల్లో మార్పులు వస్తాయని కార్మికుల ఆశిస్తున్నారు.