Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత
Paritala Sunitha : రాప్తాడు ప్రజలు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీరుచూసి మాకు ఇదేం ఖర్మ అంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. పరిటాల జపం మానేసి అభివృద్ధి వైపు దృష్టి సారించాలని హితవు పలికారు.
Paritala Sunitha : రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన చూసి, రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తీరు చూసి, ప్రజలు తమకు ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు మండలం గంగులకుంట గ్రామంలో, అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామంలో జరిగిన 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పరిటాల సునీత స్వయంగా తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్లు, నిరుద్యోగ సమస్యలు, మహిళల భద్రత, నీటి సమస్య ఇటువంటి వాటిపై ఆరాతీశారు. చాలామంది రోడ్లు నీటి సమస్య గురించి మాజీ మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకువచ్చారు. అలాగే స్థానికంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సునీత పాల్గొన్నారు. గంగులకుంట గ్రామంలో సునీత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదని అన్ని వర్గాల నుంచి అసంతృప్తి ఎదురవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పలకరించిన ఇళ్లలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ప్రత్యేకించి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పనితీరు చూసి మాకు ఇదేం ఖర్మ అనే భావనలో ఉన్నారని సునీత అన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పరిటాల సునీత స్పష్టం చేశారు. గంగులకుంట గ్రామానికి నీరు తెచ్చామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఘనంగా చెప్పుకుంటున్నారని అయితే ఇక్కడ శాశ్వత పరిష్కారంగా నీటి సమస్య తీరలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
జాకీ పరిశ్రమ వెనక్కి తీసుకురండి
రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి మానేసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నిత్యం పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికి పరిమితమవుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జాకీ పరిశ్రమ మీ వల్ల పోయింది నిజం కదా.. మీరు డబ్బులు డిమాండ్ చేసింది నిజం కాదా? అని ఆమె మరోసారి నిలదీశారు. జాకీ పరిశ్రమ విషయంలో తాము విమర్శలు చేస్తే చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు స్థాయి మరిచి తిట్టారని.. ఇలాంటి విషయాలు ప్రజలు గమనించాలని సూచించారు. మరోవైపు తమపై విమర్శలు మాని దమ్ముంటే సీఎం జగన్ దగ్గరికి వెళ్లి జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకొని రావాలన్నారు. ఇప్పటికే పరిశ్రమ వచ్చి ఉంటే సుమారు 6వేల మంది మహిళలకు ఉపాధి దొరికి ఉండేదని మీ ధన దాహం వల్లే పరిశ్రమ వెళ్లిపోయిందని ఆమె విమర్శించారు. రానున్న రోజుల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామన్నారు. మరోవైపు ఆలమూరులో పరిటాల సునీత మాట్లాడుతూ.. ఇక్కడ వేల ఇళ్లు తీసుకొచ్చామని ప్రకాష్ రెడ్డి చెబుతున్నారని.. అయితే ఆలమూరు ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఇస్తే ఏంటి ప్రయోజనం అని ఆమె నిలదీశారు. ఇక్కడ ఏ ఇంట చూసినా తమకు ఇళ్లు ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. దీనిపై కచ్చితంగా ప్రకాష్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.