Ramoji Rao : ప్రజాజీవితంలోకి లేని పవర్ ఫుల్ లీడర్ రామోజీరావు - తలవంచని మీడియా ప్రతిపక్ష సారధి !
Ramoji Rao death : రామోజీరావు రాజకీయాల్లో లేరు కానీ రాజకీయంగా పవర్ ఫుల్. మీడియా ద్వారా ప్రభుత్వాలపై ప్రజాసమస్యలపై ఆయన పోరాడిన తీరు ఆయనను పవర్ ఫుల్ గా నిలబెట్టింది.
Ramoji Rao is not in politics but politically powerful : రామోజీరావు ఎవరు ? . ఓ ఎంపీగా ఎప్పుడూ చేయలేదు.. .ఓ ఎమ్మెల్యే అసలే కాదు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలు చేయలేదు. కానీ ఆయన ముద్ర మాత్రం రాజకీయాల్లో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇది నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి జగన్ వరకూ సాగింది. తాను నమ్మిన సిద్ధాంతానికి మాత్రమే రామోజీరావు బద్దుడు. ప్రజా వ్యతిరేకంగా ఏమున్నా ఆయన నిస్సంకోచంగా వ్యతిరేకిస్తాడు.
మీడియాను ప్రజాస్వామ్య ప్రతిపక్షంగా మలిచిన ధీరుడు
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా. మీడియా అంటే పాలకపక్షానికి ఎప్పుడూ ప్రతిపక్షమే. ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజాసమస్యలను ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కఠినమైన మార్గాన్నే ఎంచుకున్నారు. సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వాలపై అంతే కఠినంగా ప్రశ్నించేవారు. మీడియాను నిఖార్సైన ప్రతిపక్షంగా నిలపడంలో ఆయన దేనికీ భయపడలేదు. ఏమీ ఆశించలేదు. ఆ తత్వమే ఆయనను ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతిపక్ష ధీరునిగా నిలబెట్టింది.
ఎలాంటి వేధింపులనైనా ఎదుర్కొన్న ధైర్యశాలి
ఇందిరాగాంధీ హయాంలో ఎదురైన వేధింపుల దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎదురైనా ఇబ్బందులను కూడా ఆయన గట్టిగా ఎదుర్కొన్నారు కానీ.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఓ సందర్భంలో శాసనమండలిలో జరిగిన రభసపై ఈనాడు పత్రికలో పెట్టిన హెడ్ లైన్ ను కారణం చూపి ఆయనను అరెస్టు చేయాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఆస్తులపై దాడి చేశారు. మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి విషయంలో వ్యవహారంచిన తీరు ఎలా ఉందో ప్రజలందరూ చూశారు. కానీ ఎక్కడా తగ్గలేదు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు.
రామోజీరావు ప్రముఖుల్ని కలవడం తక్కువ - వారే కలుస్తారు !
రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా సెలబ్రిటీగా నిలిచారు. అయితే ఆయన ఫలానా పని ఆశించడం కానీ.. చేయించుకోవడం కానీ తన జీవితంలో చేసి ఉండరు. హైదరాబాద్ వస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెళ్తారు. నిజానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి రామోజీరావుతో మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈటీవీ గుజరాత్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఆపరేట్ చేసేవారు. అప్పట్లో మోదీ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలిసేవారు. ప్రధాని అయిన తర్వాత కూడా కలిశారు.
వ్యక్తిత్వమే రామోజీరావు పవర్
రామోజీరావు ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు. ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎప్పుడూ తాను పెట్టుకున్న విలువల్ని, పెట్టుకున్న గీతల్ని దాటాలని అనుకోలేదు. దాటితే ఎంత లాభం వస్తుందని ఆలోచన కూడా మనసులోకి రానివ్వలేదు. విలువల మీద నడిచే వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు. అందుకే కరుడుగట్టిన నియంతలు దాడి చేసినా వాటి పునాదుల్ని బలహీనం చేయలేకపోయారు. నమ్మిన సిద్ధాంతానికి ఆయన కట్టుబడ్డారు.