రాజమండ్రిలో పొలిటికల్ హీట్- ఒకే టైంలో జనసేన, వైఎస్‌ఆర్‌సీపీ సమావేశాలు
ఈనెల 31న రాజమండ్రిలోని ఓ హోటల్‌లో జరిగే ఈ కాపు నేతల సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఈ మధ్య బీసీ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చర్చించిన వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పుడు కాపులతో సమావేశం కానుంది. రాజమండ్రి వేదికగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి వైసీపీలోని కాపు లీడర్లతోపాటు అధిష్ఠానం నుంచి కీలక వ్యక్తులు హాజరుకానున్నారు.
ఈ మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌సీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. కాపులను కించపరిస్తే సహించేది లేదని పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై వైసీపీ లీడర్లంతా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఇది జరిగి పదిహేను రోజుల తర్వాత కాపులతో మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తిని రేపుతోంది. అదే టైంలో పవన్ కల్యాణ్ కూడా పీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి ఈ రెండు సమావేశాలతో రాజమండ్రి హీటెక్కనుంది.
ఈనెల 31న రాజమండ్రిలోని ఓ హోటల్‌లో జరిగే ఈ కాపు నేతల సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అధిష్ఠానం నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డితోపాటుగా, వైవీ సుబ్బారెడ్డి కూడా హజరు అయ్యే అవకాశం ఉంది.
ఈ భేటీలో కాపు నేతల గురించి తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నారు. పలు కీలక అంశాలను చర్చించటంతోపాటుగా భవిష్యత్ కార్యచరణ కూడా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల విజయవాడ వేదికగా బీసీ నాయకుల సమావేశాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు కాపు నేతలతో సమావేశాన్ని రాజమండ్రి వేదికగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కాపు నేతలు ఎక్కువగా ఉన్నందున రాజమండ్రిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జనసేనే టార్గెట్...
ఇటీవల విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత వైసీపీ నేతలు జనసేనను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ను నేరుగా ఢీ కొట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వైసీపీ ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి జనసేనకు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి ఫ్యాన్‌గా మారిపోయారు. అసెంబ్లీలో మెజార్టీ కన్నా అధికంగా ఉన్న వైసీపీ జనసేనను టార్గెట్ చేయటం వెనుక చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనే సామెత గుర్తు చేస్తున్నారు నాయకులు.