Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
TDP Vs Janasena: పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలకు మద్దతుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. టీడీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే వర్మ అండగా నిలిచారు.
Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పోటీ చేసిన టీడీపీ(TDP)-జనసేన(Janasena) ఆ ఎన్నికల తర్వాత ఇప్పుడు తొలిసారి ప్రత్యర్థి పార్టీలుగా మారాయి. టీడీపీ, జనసేన నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఈ పోటీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇలాకాలో కావడం మరో విశేషం. మేము చంద్రబాబు(Chandra Babu) తాలూకా అంటూ టీడీపీ నేతలు బరిలో దిగితే, మేము పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేన నేతలు పోటీకి వస్తున్నారు. ఈ పోటీ జరిగి తీరుతుందా లేక పోటీదారులు ఓ అవగాహనకు వచ్చి ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. పోటీయే ఖాయమైతే మాత్రం ఏపీలోని కూటమిలో కలవరపాటుకి కారణమయ్యే అవకాశం ఉంది. అయితే అది పిఠాపురం, అందులోనూ జనసేనాని పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కాబట్టి ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు.
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ పోటీ నుంచి వైసీపీ స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంది. ఓ దశలో వైసీపీ నేతలు కూడా బరిలో దిగాలని ఆశపడ్డారు కానీ, స్థానికంగా మద్దతు లేకపోవడంతో వెనక్కు తగ్గారు. పోటీకి దిగి ఓడిపోతే అది మరింత పరువు తక్కువ అని భావించారు. పైగా ఎన్నికల ఖర్చు భరించేందుకు వైసీపీలోని స్థానిక నాయకులు కూడా ఉత్సాహంగా లేరు. అందుకే ఈ ఎన్నికలనుంచి వైసీపీ తప్పుకుంది. ఇక టీడీపీ, జనసేన తరపున పోటా పోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 5 డైరెక్టర్ పోస్ట్ లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా స్థానాలకోసం టీడీపీ, జనసేన నుంచి మొత్తం 18మంది నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అంటే బరిలో 12మంది నిలిచారు. 5 డైరెక్టర్ పోస్ట్ ల కోసం ఈ 12 మంది మధ్య పోరు మొదలైంది.
జనసేన నేతలకు మద్దతుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఇక టీడీపీ తరపున బరిలో దిగుతున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే వర్మ అండగా నిలిచారు. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి ఇరు వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విత్ డ్రా టైమ్ కూడా పూర్తవడంతో బరిలో నిలిచిన 12మందికి గుర్తులు కేటాయించారు. ప్రచారం మొదలైంది. ఈనెల 6న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఏదయినా కీలక పరిణామం జరుగుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
తొలుత దీన్ని చిన్న పోటీగానే రెండు పార్టీలు లైట్ తీసుకున్నాయి. ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాాశాలుంటాయని అనుకున్నారంతా. కానీ జనసేన, టీడీపీ నేతలు దీన్ని ప్రతిష్టగా తీసుకున్నారు. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ జనసేన గెలవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. అసలే పవన్ కోసం తాను ఎమ్మెల్యే సీటు త్యాగం చేశానని అంటున్న వర్మ.. కనీసం పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో అయినా తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి రెండు పార్టీల అధిష్టానాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. ఎన్నికల టైమ్ దగ్గరపడితే అప్పుడు సర్దుబాటు జరిగే అవకాశముంది. ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది వేచి చూడాలి.