వారికి సిగ్గులేదా! నిన్నటి నుంచి అన్ని కొత్త డ్రామాలే - చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రాణాలకే ప్రమాదం ఉందంటూ, నిన్న నుంచి కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ప్రిజనర్ పోయిన తర్వాత అదేమన్న అత్తగారిల్లా, ఏసీ పెట్టడానికి అని ప్రశ్నించారు. ఖైదీలకు ఎక్కడా లేని హక్కు ఒక్క చంద్రబాబుకే ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. జైలులో ఉన్న సిబ్బంది చంద్రబాబుకు రాచిరంపాన పెడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు సమాజంలో ఉండదగిన వ్యక్తులేనా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం అనేది ఎవరికి లేని సకల హక్కులు ఉన్న పార్టీలా భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల పైత్యం భరించాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు జైలులో ఉంటే ఏ రకంగా ప్రత్యేకమైన ఖైదీ అని నిలదీశారు. ఖైదీలందరికి వర్తిస్తున్న షరతులు వర్తిస్తాయని, వసతులు ప్రత్యేకంగా ఏమీ ఉండవని ప్రశ్నించారు. చొక్కా పూర్తిగా వేసుకోవడంతోనే హుమిడిటీ పెరిగి ఉండవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం ఎందుకు బ్యారెక్‌ను ఖాళీ చేయాలని ప్రశ్నించారు. డాక్టర్లను 24 గంటలూ అందుబాటులో ఉంచారని, వారి కోసం ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు కుటుంబానికి కొంచమైనా సిగ్గు లేదా అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అర్జెంట్‌గా బయటకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆస్పత్రికి, ఆ తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్లేలా ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. రిమాండ్‌లో ఉన్నా కూడా శిక్షేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచమంతా నీ కోసమే క్యాండిల్స్ పట్టాలి, తట్టాలు కొట్టాలంటే ఎలా అని ప్రశ్నించారు.
బీజేపీ నేతల వద్దకు బంధువులను పంపించి బయటకు రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మీడియా మీద సరైన సమాచారం బయటకు పోకపోతే హింసిస్తున్నట్లు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఎన్ని వీలయితే అన్ని సౌకర్యాలు అన్ని కల్పిస్తున్నారని, క్యారవాన్ పంపించి ఏసీ పెట్టాలంటే ఎలా అని ప్రశ్నించారు. మాములుగా టెంపరేచర్స్ పెరిగితే వచ్చే సమస్యలే చంద్రబాబుకు వచ్చాయని అన్నారు. నారా లోకేశ్ ఢిల్లీలో డ్రామాలు చేశారని మండిపడ్డారు. లోపల మాట్లాడింది ఒకటైతే, బయటకు వచ్చి చెప్పింది మరోకటని అన్నారు.