Sir Arthur Cotton: గోదారోళ్లు తినే ప్రతి ముద్దలోనూ కాటన్ దొరను ఎందుకు చూసుకుంటారు?
గోదావరి ప్రజలకు ఆరాధ్య దైవం సర్ ఆర్ధర్ కాటన్ దొరఅపరభగీరధుడు కాటన్ జయంతి నేడు
కరవుతీరేంత నీరు కళ్లెదుటే సాగరంలో కలిసిపోతుంటే మూడు పంటలు పండే సారవంతమైన భూమి ఉండి కూడా నిట్టూర్చడమే తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల డెల్టా ప్రజల జీవితాల్లో దేదీప్యమానమైన వెలుగులు నింపారు సర్ ఆర్ధర్ కాటన్. గోదావరి ప్రజల దుర్బర జీవితాల్ని కళ్లారా చూశారు.. బ్రిటిష్ అధికారులు. ఆనకట్ట కట్టేందుకు అనుకూల పరిస్థితులను అంచనా వేసేందుకు సర్ ఆర్ధర్ కాటన్ అనే వ్యక్తి రాజమండ్రికి రావడం, బ్యారేజీ నిర్మాణానికి ధవళేశ్వరం, విజ్జేశ్వరం మధ్య అనుకూలతలు బాగున్నాయని గమనించిన సర్ ఆర్ధర్ కాటన్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఒక మహా యజ్జానికి 1847లో శ్రీకారం చుట్టారు.
తడారిన గొంతుకల్లో జీవజలాల్ని నింపి గోదావరి డెల్టా ప్రజల ఆరాధ్యదైవం అయ్యారు కాటన్ దొర.. ఆయన పడిన కష్టం, నిస్వార్ధసేవ, అపారమైన మేధోశక్తి, అంతకుమించి తనవారు కాకపోయిన ప్రజలకు మంచిచేయాలన్న తపన కాటన్ మహాశయుడ్ని అపరభగీరధునిగా గోదావరి ప్రజల గుండెల్లో దేవుడ్ని చేశాయి.. ఆయన అంకుఠిత దీక్షతో 1847లో ప్రారంభించిన ఆనకట్ట పనులు వేలాది మంది శ్రామికులు, విదేశాల నుంచి తీసుకువచ్చిన యంత్రాలు, కలబోసి మొత్తం మీద 1852 నాటికి పూర్తిచేయగలిగారు.. గోదావరి డెల్టాలో సిరుల పంటకు ఊపిరిలూదారు..
ఈ నేపథ్యమే డెల్టాగా పేరు..
ఒక పక్క సముద్రం, ప్రధానమైన రెండు నదీశాఖలు.. ఈ మధ్యలో ఉన్న భూభాగమే డెల్టాగా పేర్కొంటారు. ఇక్కడ చుట్టూ జీవజలాలున్నా వృథాగా కలిసిపోతున్న జలాల్ని అడ్డుకట్టవేసే ఆనకట్ట నిర్మించడాన్ని భుజస్కందాలపై వేసుకున్న మహనీయుడు సర్ ఆర్ధర్ కాటన్ దొర. ఈప్రాంతం అంతా గుర్రంపై తిరుగుతూ ఆకలి వేసిన సమయంలో కేవలం అరటిపండ్లను తిని కడుపు నింపుకున్న కార్యదీక్షకుడు అంటుంటారు కాటన్ మహాశయుడ్ని.. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం అనంతరం వశిష్ట నదీకి ఆవతలివైపున ఉన్న వేలాది ఎకరాల భూభాగానికి సాగు నీరందక నిరూపయోగంగా ఉండిపోతుందని గమనించారు. 1946 - 48 మధ్య కాలంలో అక్డిడెక్టు నిర్మాణం చేపట్టి సాగునీటిని మళ్లించగలిగారు. ఈ సమయంలోనే అపర అన్నపూర్ణగా పేరుగడించిన మహాతల్లి డొక్కా సీతమ్మ కాటన్ మహాశయునికి చేసిపెట్టిన గరిక పచ్చడి అంటే ఆయనకు అత్యంత ప్రీతపాత్రమే కాదు. గోదావరి ప్రజల మమకారాన్ని బ్రిటీష్ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లగలిగిందని చెబుతారు. ఎందరో అభాగ్యులకు అన్నం పెట్టిన మహాదేవతగా డొక్కా సీతమ్మను నేటికీ స్మరించుకుంటారు..
పంట కాలువల వ్యవస్థ ఏర్పాటు ద్వారా సస్యశ్యామలం
ప్రధాన పంటకాలువల వ్యవస్థలు ఏర్పాటు చేసి తద్వారా పిల్లకాలువల వరకు సముద్ర తీర ప్రాంతాలకు సైతం సాగునీటిని మళ్లించిన మహానుభావుడు కాటన్ దొర. ఆయన దూరదృష్టి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అనేక తీర ప్రాంతాలను సస్యశ్యామలం చేసింది.. పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పంట కాలువ వ్యవస్థ ఆయన దూర దృష్టి వల్లనే నీటి ఎద్దడి సమయంలోనూ సమర్ధవంతంగా సేవలందిస్తూ అన్నదాతల్లో భరోసా నింపుతోంది..
ప్రతి ఇంట్లో దేవుడై.. గుండెల్లో కొలువై..
గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆయన గుర్రంపై స్వారీ చేస్తున్న నిలువెత్తు కాంశ్యవిగ్రహాలు అనేకం దర్శనమిస్తాయి.. ప్రతీ అన్నదాత ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలు కనిపిస్తుంటాయి.. అన్నదాతకు సిరుల పంట పండినప్పుడు ఆ అన్నం ముద్ద నోట్టో పెట్టుకునే ముందు ఆయన్ను స్మరించుకుని తినే అలవాటు నేటికీ ఉండడం విశేషం. కడియం ప్రాంతంలో కాటన్ మహాశయుని జయంతి నాడు రైతులు ఆయన విగ్రహానికి ధాన్యాభిషేకం చేసి ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆయన వర్ధంతి నాడు పిండ ప్రధానం చేస్తారు.
ఆయన జ్ఞాపకాలతో మ్యూజియం..
ధవళేశ్వరం బ్యారేజి కట్టే సమయంలో కాటన్ దొర వినియోగించిన వస్తువులు, ఆయన రూపొందించిన ఇంజనీరింగ్ మ్యాప్ అన్నీ కళ్లకు కట్టినట్లు నేటి తరాలు తెలుసుకునేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ ఆయన గురించిన విశేషాలతోపాటు ఆనాడు ఆనకట్ట నిర్మించేందుకు వినియోగించిన యంత్రాలు, యంత్ర సామాగ్రి, ఆయన జీవిత విశేషాలు, ఆయన చిత్రపటాలు ఇలా చాలానే పొందుపరిచారు. ఆయన కాలంలో నిర్మించిన రాతి కట్టడాలే నేటికీ జలవరుల శాఖ, నీటిపారుదలశాఖ కార్యాలయాలుగా కొనసాగుతుండడం గమనార్హం.