Prabhas Fans అత్యుత్సాహంతో థియేటర్‌లో మంటలు, ప్రాణ భయంతో ప్రేక్షకుల పరుగులు
Happy Birthday Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామాతో మంటలు చెలరేగాయి.
Fire Accident at Movie Theater: దేనికైనా కచ్చితంగా హద్దులు ఉండాలి. అభిమానం హద్దులు దాటినా, ఏం చేయాలో ఆలోచన లేకుండా చేసే పనులైనా అవతలి వారికి చిరాకు, కోపాన్ని తెప్పిస్తాయి. కొన్ని సందర్భాలలో అవతలి వ్యక్తుల ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు సైతం ఏర్పడతాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా థియేటర్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామాతో మంటలు చెలరేగాయి. సినిమా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ప్రాణ భయంతో థియేటర్ బయటకు పరుగులు తీశారు.
అసలేం జరిగిందంటే..
నేడు ప్రభాస్ పుట్టినరోజు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలో భాగంగా రాష్ట్రంలో పలు సెంటర్లలో ప్రభాస్ సినిమా షోలు ప్రదర్శిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆ హీరో ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బిల్లా’ సినిమాను ప్రదర్శించారు. అయితే యాక్షన్ సీన్స్ ప్రదర్శితం అవుతున్న సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. షో రన్ అవుతుండగానే కొందరు యువకులు బాణసంచా కాల్చారు. టపాసులు కాల్చడంతో థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని సీట్లకు సైతం మంటలు అంటుకుని పాక్షికంగా కాలిపోయాయి. థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హాల్ మొత్తం పొగ వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు ప్రాణ భయంతో థియేటర్ బయటకు పరుగులు తీశారు. థియేటర్ లో అలాగే కూర్చుంటే పొగ వ్యాపించి ప్రాణాల మీదకు వస్తుందేమోనని ప్రేక్షకులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
#Prabhas𓃵 #Prabhas #PrabhasBirthday #Billa4KCelebrations #Billa #PrabhasBirthdayBash pic.twitter.com/kvBcJLcprH
— Uday (@Udaykiran96u) October 23, 2022
ప్రభాస్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అరుపులు..
మొదట్లో ఏదో ఎంజాయ్ మెంట్ అనుకుని ప్రభాస్ ఫ్యాన్స్ బాణసంచా కాల్చారు. దాంతో మంటలు చెలరేగి సీట్లకు నిప్పు అంటుకోవడంతో పొగ దట్టంగా వ్యాపించింది. ఇది పెద్దది అవుతుందని భావించిన యువకులు ఆ తరువాత మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. పొగ ఎక్కువ కావడంతో ఊపిరాడక కొందరు ప్రేక్షకులు ప్రాణ భయంతో వెంకట్రామ థియేటర్ బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఫ్యాన్స్ ఆ సమయంలోనూ ప్రభాస్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ గట్టిగా కేకలు వేశారు. డోర్లు తెరిచి బయటకు వెళ్లిపోవడం బెటర్ అని కొందరు ప్రేక్షకులు బయటకు వెళ్లిపోయారు. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గకుండా అల్లరితో థియేటర్లో రచ్చ రచ్చ చేశారు.
Happy Birthday Prabhas Anna🎂😍#HappyBirthdayPrabhas #Billa4K #Prabhas𓃵 #PrabhasBirthday #Prabhas pic.twitter.com/0MWkkInmFN
— దసరా Dhanush🧔🏻 (@SaiDhanush01) October 23, 2022
కోనసీమ జిల్లాలోనూ ఘనంగా ప్రభాస్ బర్త్‌డే..
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోనసీమ క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో ప్రభాస్ జన్మదిన వేడుకలు చేస్తున్నారు. అమలాపురంలోని వీపీసీ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్రభాస్ యాక్షన్ మూవీలలో ఒకటైనా ‘బిల్లా’ మూవీని ప్రదర్శించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఫ్యాన్స్. ప్రభాస్ సినిమాల పాటలకు ఫ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.