(Source: ECI/ABP News/ABP Majha)
Pilli Subhash: వైసీపీ ఎంపీ-మంత్రి మధ్య విభేదాలు మరో స్థాయికి! రాజకీయ వారసుణ్ని ప్రకటించేసిన పిల్లి సుభాష్
రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో వైఎస్ జగన్ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నెలరోజుల క్రితం కీలక ప్రకటన చేసిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుగోపాలక్రిష్ణకు టికెట్ ఇస్తే ఇక తాను లేదా తన కుమారుడు అతడికి వ్యతిరేకంగా బరిలో నిలుస్తామని తేల్చి చెప్పారు.
ఆ మాటకు మరింత బలం చేకూర్చేలా నేడు తన కుమారుడితో ప్రమాణం చేయించారు. రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించేశారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్‌ను ప్రజలు, కార్యకర్తలు ఆదరించాలని కోరారు. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక అంశాలను మాట్లాడారు. ఈ సందర్భంగానే కుమారుడి రాజకీయ అరంగేట్రాన్ని ప్రమాణం చేయించి మరీ అధికారికంగా ప్రకటించారు. కార్యకర్తల అందరి సమక్షంలోనే నీతి, నిజాయితీ మీదనే రాజకీయాలు చేసుకుంటూ రావాలని కుమారుడికి సూచన చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు తరలివచ్చారు. సూర్యప్రకాశ్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘నా రాజకీయ జీవితంలో రామచంద్రపురం ప్రజల పాత్ర చాలా ముఖ్యం. నా కుమారుడి రాజకీయ ప్రవేశంతో నియోజకవర్గ ప్రజలకు ఇంకా మంచి చేసే భాగ్యం కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
మంత్రి వేణుగోపాల క్రిష్ణకి మరోసారి రామచంద్రాపురం టికెట్ ఇస్తే తాను లేదా తన కుమారుడు అతడిపై పోటీ చేస్తామని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గత నెలలో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మంత్రి వేణుతో కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని చంద్రబోస్ అన్నారు. అయినా తనకు అది ఇష్టం లేదని తేల్చి చెప్పారు. తాను క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోబోనని మాట్లాడారు.
కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తన నివాసానికి పిలిపించారు. ఆ సందర్భంగా కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. మంత్రి వేణు అక్రమాలపై సుభాష్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముందుగా సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, మిథున్ రెడ్డిని కలిసి ఆ తర్వాత సీఎం జగన్‌తో అరగంటపాటు సమావేశం అయ్యారు.
తొలి నుంచి తనకు అండగా ఉన్న శెట్టి బలిజ సామాజికవర్గం నేతలను మంత్రి వేణు వేధిస్తున్నారని అన్నారు. వేణు కుమారుడు రామచంద్రాపురంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడని ఆరోపించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై మంత్రి అనుచరులు దాడి చేశారని తెలిపారు. పరస్పర ఆరోపణలు, దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఇరువురు నేతలు విభేదాలు వీడాలని సూచించారు. ఇకపై కలసి పని చేయాలని సూచిస్తూ.. సయోధ్య బాధ్యతను రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి అప్పగించారు. తాజాగా మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహార శైలితో అధిష్ఠానం సయోధ్య ప్రయత్నాలు ఫలించలేదని తేటతెల్లం అయింది.