Pawan Kalyan Donation: పోలవరం నిర్వాసితులకు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
Andhra Pradesh News: పోలవరం నిర్వాసితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయాల భారీ విరాళం ప్రకటించారు. రూ.1 కోటిని పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సెస్ నిధికి జమ చేస్తానని స్పష్టం చేశారు.
Pawan Kalyan Donation For Polavaram Residents: ఇల్లు, వాకిలి లేక తట్టా బుట్టా చేతబట్టుకుని నలిగిపోతున్న పోలవరం నిర్వాసితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. తన కష్టార్జితం నుండి 1 కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మంగళవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
పోలవరం పూర్తి చేయడం కూటమి సర్కార్ ముఖ్య ఉద్దేశం
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రం సుముఖంగానే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులైన 1.6 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేది ప్రాజెక్టులో కీలకమన్నారు. ఇందుకోసం సుమారు రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవసరం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన మొత్తంలో భరించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వినియోగించుకుంది తప్పితే ... ప్రాజెక్టు పూర్తికి కనీసం చొరవ చూపలేకపోయిందని విమర్శించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టును అందించేందుకు వారే చొరవ తీసుకొని ప్రతి వస్తువు కొనుగోలులో ఒక పైసా చొప్పున పోలవరం ఆర్ అండ్ ఆర్ సెస్ నిధికి సొమ్ములు అందించాలన్నారు. ఇలా 6 నెలలు సెస్ నిధికి డబ్బు జమ అయితే ప్రాజెక్టును 2027 కల్లా పూర్తిస్థాయిలో నిర్మించుకోవచ్చని చెప్పారు.
‘గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం మేర పూర్తయ్యింది. మిగతా పనుల్ని పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త విధానాల పేరు చెప్పి ప్రాజెక్టును అటకెక్కించారు. నిధులు అవసరమైనప్పుడు బిల్లులు పెట్టుకోవడం కేంద్ర నుంచి నిధులు తెచ్చుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఏటీఎం యంత్రంలా వైసీపీకి పోలవరం ఉపయోగపడింది. అతి పెద్ద ప్రాజెక్టును, ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా మారే అద్భుత ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ పూర్తి నిషేధిత ప్రాంతంగా చేసి అక్కడ ఏమీ జరుగుతుందో కూడా బయటకు వారు తెలుసుకోలేని విధంగా చేసింది. ప్రాజెక్టు గురించి మంత్రులను అడిగితే వెటకారపు సమాధానాలు, వెకిలి భావాలు పలికించడం తప్ప ప్రాజెక్టు గురించి ఎప్పుడు మాట్లాడలేదని’ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు కదులుదాం
వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో రూ. 41వేల కోట్లు, ఇసుక దోపిడీలో రూ. 45 వేల కోట్లు పక్కదారి పట్టాయని పవన్ ఆరోపించారు. అవినీతి చేయకపోతే పోలవరం ఎప్పుడో ప్రజలకు అందుబాటులోకి వచ్చేదన్నారు. కేంద్రం పెద్దలను పోలవరం గురించి అడిగితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంక్లిష్టత తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణం కంటే పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయడం ప్రధానమన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోవడం 5 కోట్ల ఆంధ్రుల బాధ్యతగా తీసుకుందాం, ప్రాజెక్టు ముంపులో సర్వం కోల్పోయి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసిన గిరిజనులకు అండగా నిలిచే బాధ్యతను తీసుకుందామని పిలుపునిచ్చారు.
ప్రజల వద్ద నుంచి పైసా పైసా కూడబెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు వేయాలన్న పవన్... ఈ సెస్ నిధికి మొదటగా తాను సొంత డబ్బు రూ.1 కోటిని పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సెస్ నిధికి జమ చేస్తానని స్పష్టం చేశారు. మోదీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి తగిన సాయం కోరతాను. ఆరు నెలల్లో సెస్ ద్వారా సేకరించిన సొమ్మును పునరావాసానికి వినియోగించి 2027 కల్లా పోలవరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకుందామని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ పాలనలో జలవనరుల శాఖ మంత్రికి నీళ్ల గురించి తెలియదు. పోలవరం ప్రాజెక్టు బతుకు వ్యధలు కనిపించవు అని ఎద్దేవా చేశారు. ప్రతి సభలోనూ తండ్రిలేని బిడ్డను అని చెప్పుకొనే జగన్ కు... పోలవరం ప్రాజెక్టు ముంపులో ఊళ్లు లేని బిడ్డలు, రోడ్డున పడ్డ బిడ్డలు కనిపించలేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రూ. 33 వేల కోట్ల ఇవ్వడానికి ముందుకురాని వైసీపీ ప్రభుత్వం... ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసేందుకు రూ.1300 కోట్లు, మళ్లీ వాటిని తొలగించేందుకు మరో 1000 కోట్లు ఖర్చు చేసిందన్నారు.