జనసేన, టీడీపీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ - ఫలించిన సీఎం బుజ్జగింపులు!
రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని రోజులుగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య జరుగుతున్న వార్ అధిష్టానం పిలుపుతో సద్దుమణిగినట్లు అయింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వైఎస్ఆర్ సీపీలో జరుగుతోన్న రగడ కొంత వరకు సద్దుమణిగినట్లు అయ్యింది.. పార్టీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణల మధ్య జరుగుతోన్న వార్ అధిష్ఠానం పిలుపుతో చక్కబడ్డట్లుగా అయ్యింది.
‘‘రెండు రోజుల క్రితం పెద్ద మాట మాట్లాడాను.. ఎంపీగా రాజీనామా చేసి అయినా సరే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని మాట్లాడాను.. ముఖ్యమంత్రికి క్షమాపణ చెబుతున్నా’’నని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పార్టీ కేడర్‌పై క్రిమినల్ కేసులతోపాటు ఫిజికల్‌గా వారిపై అటాక్ చేశారని, వారంతా నిరాశ నిస్పృహలతో ఉన్న పార్టీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేందుకే ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పార్టీ అధిష్టానం విజయవాడ పిలిపించి సంప్రదింపులు జరిపిందని.. ముఖ్మమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి సర్వే టీం ద్వారా సర్వే చేయిస్తానని అన్నారని తెలిపారు. సర్వే రిపోర్టు ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం వల్ల దానిపై ఎవరి ప్రమేయం ఉండదు కాబట్టి దానికి తానే అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.
జనసేన, టీడీపీల వైపు వెళ్లే ప్రసక్తే లేదు..
పార్టీ నిర్మాణం నుంచి తాను ఉన్నానని, తాను జనసేన, టీడీపీలవైపు చూస్తున్నట్లు కొన్ని పత్రికలు రాస్తున్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ తన పార్టీ అని, తన చేతులతో నిర్మాణం చేసిన పార్టీ దివంగత మహానేత రాజశేఖరెడ్డి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు తనకు ఎటువంటి ఏ లోటు చేయలేదని అన్నారు. ఈ విషయం తాను ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనే చెప్పానని అన్నారు. తాను వైఎస్ఆర్ సీపీలోనే ఉంటానని, జనసేన, టీడీపీల వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఎంపీ బోస్ తేల్చిచెప్పారు.
వివాదం సద్దుమణిగినట్లేనా..
రామచంద్రపురం వైఎస్ఆర్ సీపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ద్వారా సద్దుమణిగినట్లేనని అంతా భావిస్తున్నారు.. అయితే మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ల మధ్య, వారి వారి అనుచరుల మధ్య మాత్రం అంతర్గత రగడ మాత్రం అలానే ఉంటుందని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో సమగ్ర సర్వే నిర్వహించి ఆపై ముఖ్యమంత్రి ఎవరికి హామీ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండాలని సూచించడంతో దానికి ఇరువురు అంగీకరించడంతో చాలా వరకు ఈ వివాదం సద్దుమణిగినేట్లనని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇదే నియోజకవర్గంలో బలమైన మరో నేత, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మంత్రి, ఎంపీ వివాదంపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎవరికి సీటు ఇచ్చినా వారి గెలుపునకు కృషిచేయాల్సిన అవసరం తమ ముగ్గురిపైనా ఉందని, ఇందులో మరో అభిప్రాయం లేదని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ రాబోతున్నారని, ఓడిపోయే పార్టీలవైపు వెళ్లాలని ఎవ్వరూ అనుకోరని అన్నారు.