Electric Scooter Burnt: కోనసీమ జిల్లాలో మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్దం, పక్కనే కారు పార్కింగ్!
Electric Scooter Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో ఎలక్ట్రికల్ స్కూటీలో షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం పార్క్ చేసి ఉంచడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
Electric Scooter Fire Accident: పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాడు సామాన్యుడు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లతో పాటు ఈవీ కార్లు కూడా పెద్ద సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. కార్ల విషయంలో పేలుళ్లకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటీలు తరచూ అగ్నిప్రమాదానికి గురవుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ట్రలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఏదో కారణంతో కాలిపోయిన ఘటనలు చూశాం. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో ఎలక్ట్రికల్ స్కూటీలో షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక పరిథిలో గుడాయి లంకలో గంటా పెద్దిరాజు అనే వ్యక్తికి చెందిన ఒక ఎలక్ట్రికల్ స్కూటీని తన ఇంటి ఆవరణలో పార్కింగ్ చేశాడు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో పెద్దిరాజు కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనం పార్క్ చేసి ఉంచడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పక్కనే కారు కూడా పార్కింగ్ చేసి ఉండటంతో ఆ వాహనం సైతం అగ్నికి ఆహుతై పేలి పోతుందేమోనని కంగారుపడ్డారు. స్థానిక నేత రంగ సాయి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు.
గత ఏడాది సిద్దిపేటలోనూ పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ
సిద్దిపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటి ముందు ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలింది. దీంతో ఏకంగా ఇల్లు కూడా దగ్దం అయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటీని పార్క్ చేశారు. అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టారు. అయితే, అనుకోకుండా స్కూటీ నుంచి మంటలు చెలరేగి పేలింది. ఆ మంటలకు దుర్గయ్య ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇంట్లోని వారు లేచి చూశారు. ఇంటికి కూడా నిప్పు అంటుకొని ఉండడంతో ఇంట్లోవారు ప్రాణ భయంతో బయటికి పరిగెత్తారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గత ఏడాది చెన్నైలో ప్యూర్ ఈవీ స్కూటర్ మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. ఆ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు ప్యూర్ ఈవీ ద్విచక్ర వాహనంలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాహన దారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే విధంగా వాటిపై కేంద్రం భారీ రాయితీలు అందిస్తుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.