రావులపాలెం కాల్పులు: ఏడుగురు అరెస్ట్, నిందితుల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన ఎస్పీ
సెప్టెంబర్ 27న కాల్పులు జరిగిన ఘటనపై ఏడుగురిని, అందులో ఓ బాల నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
రావులపాలెం కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లుగా కోనసీమ జిల్లా ఎస్పీ సీ హెచ్ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో ఒకర్ని అరెస్ట్ చేయగా శనివారం మరో అరుగుర్ని అరెస్ట్ చేశామని అందులో ఒక మైనర్ ఉన్నాడని ఎస్పీ చెప్పారు. గుడిమెట్ల ఆదిత్యా రెడ్డిపై సెప్టెంబర్ 27న కాల్పులు జరిగిన ఘటనపై సాగిరాజు అప్పల త్రినాథవర్మ, పొలుమాటి సుధీర్ కుమార్, పితాని భగత్ నాగ దుర్గా ప్రసాద్, కడలి సుధీర్ కుమార్, యర్రంశెట్టి మురళీకృష్ణ, ఎస్ కె రబ్బానీతో పాటు, బాల నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలని దురభిప్రాయంతో అందరూ ఏకమై, ధనికులు, వడ్డీలకు అప్పులు ఇచ్చేవారి మీద నిఘా పెట్టుకుని వారి ఇళ్లలో అనుకూల పరిస్థితుల్లో చొరబడి వారిని బంధించి, ఇంట్లోని నగలు, డబ్బులను దోచుకునే వారని పోలీసులు తెలిపారు. అవసరమైతే వారిని కిడ్నాప్ చేసి, తీసుకుని వెళ్ళి ఇంకా అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేసేవారని అన్నారు. ఆ నేరము చేసే సమయంలో ఎవరయినా అడ్డు వచ్చినా, పట్టుకోవాలని ప్రయత్నించినా అవసరమైతే కాల్పులు జరిపి చంపాలని ప్రయత్నించేవారని పోలీసులు వెల్లడించారు. ఒక్కోసారి యాసిడ్ కూడా వారిపై చల్లాలని, మత్తు ఇంజెక్షన్ కూడా చేయాలని, ఒకవేళ వారు తలుపులు తీయకపోతే బాంబులు వేసి- డోర్లను బద్దలు కొట్టి ఇంటిలోనికి వెళ్లాలని ప్రణాళిక చేసేవారని అన్నారు.
‘‘రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఫిర్యాది అయిన గుడిమెట్ల ఆదిత్యా రెడ్డి ఇంటికి వెళ్ళి బంధించి, డబ్బు, నగలు దోచుకొని కిడ్నాప్ చేయాలని యర్రంశెట్టి మురళీ కృష్ణతో చర్చించారు. అతని సమాచారం మేరకు పొలుమాటి సుధీర్ కుమార్, ఆడారి సాయి, పితాని భగత్ నాగ దుర్గా ప్రసాద్, కడలి సుధీర్ కుమార్, సాగిరాజు అప్పలనాథ్ వర్మ, రాజీవ్ వర్మలు రావులపాలెం అరటికాయ మార్కెట్ నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆదిత్య రెడ్డి ఇంటికి వెళ్ళి మెట్లపై భాగంలో కాపుకాసి అతనితో మాట్లాడటం ప్రారంభించారు.
పొలుమాటి సుధీర్ కుమార్, ఆడారి సాయి కిడ్నాప్ చేయటానికి గల సామాగ్రిని ఒక ట్యాబ్ ను ఉంచి బిల్డింగ్ మెట్ల కింద కిడ్నాప్ చేయుటకు ప్రయత్నించే సమయంలో అతనిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ రౌండ్ గురి తప్పగా ఆదిత్యా రెడ్డి వారిపై కలబడి కింద పడేసి ముద్దాయి చేతిలో ఉన్న పిస్టల్ ను లాక్కునే సమయంలో మేగజైన్ కింద పడింది. అదే సమయంలో ఎదురుగా ఒక కిళ్లీ కోట్టు నిర్వహించే వ్యక్తి ముద్దాయిల వైపు వచ్చారు. రెండో వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్ ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ కేసులో నాటుబాంబులు చుట్టటానికి సహకరించినవారిని, స్వాధీనపర్చుకున్న 2 తుపాకులు సరఫరా చేసిన వారిని ముద్దాయిలుగా గుర్తించి అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ముద్దాయిల గురించి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు.
అమలాపురం సీసీఎస్, రావులపాలెం పోలీసుల సంయుక్త దర్యాప్తులో పై కేసును ఛేదించామని అన్నారు. సిబ్బందిని అభినందిస్తున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, గన్నవరం సీఐ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.