CPI Narayana: సీపీఐ నారాయణపై జన సైనికుల ఆగ్రహం, క్షమాపణ చెప్పేవరకు అక్కడే!
CPI Narayana: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి క్షమాపణ చెప్పేవరకు విడిచి పెట్టమంటూ ఆయనను చుట్టుముట్టారు.
CPI Narayana: మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మెగా అభిమానులు చుక్కలు చూపించారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో చిరంజీవిని బేరగాడు అనే పదం ఉపయోగించి నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం బడుగువానిలంక వరద బాధితులను పరామర్శకు వచ్చిన ఆయన చెముడు లంకలో మరబోటు ఎక్కి బడుగువానిలంక వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి కడియం మండలం కడియపులంక, రావుల పాలెం ప్రాంతాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అక్కడే ఉన్న సీపీఐ నారాయణను చూడగానే ఒక్కసారిగా ఉవ్వెత్తున లేశారు.
చిరంజీవి కాలిగోటికి కూడా సరిపోవంటూ...
తమ అభిమాన హీరో చిరంజీవిపై ఎందుకు అనుచిత వాఖ్యలు చేశారంటూ నిలదీశారు. క్షమాపణ చెప్పి బయలు దేరాలని ఉమ్మడి గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కడియపు లంక వార్డు సభ్యురాలు బోడపాటి రాజేశ్వరితో పాటు పలువురు జన సైనికులు ఆయనపై విరుచుకు పడ్డారు. మంగళవారం రాజేశ్వరి నారాయణ తిట్టుపోస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి సమయంలో నేరుగా నారాయణ కనపడటంతో ఆమె మరింత కోపంతో ఆయనపై ఊగిపోయింది.చిరంజీవి కాలిగోటికి కూడా పనిచేయని మీరు ఆయనపై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కొందరు జన సైనికులు గడ్డి తింటున్న నారాయణ అంటూ నినాదాలు చేశారు.
క్షమాపణ చెప్పే వరకు చుట్టుముట్టిన జనసైనికులు..
క్షమాపణ చెప్పాలని పట్టుపట్టినా ఆయన పట్టించుకోకుండా బోటుపై బడుగువానిలంక బయలు దేరారు. వెంటనే వీళ్లు కూడా వేరే బోటులో బడుగువానిలంక చేరుకున్నారు. తక్షణమే చిరంజీవికి క్షమాపణ చెప్పాలని అప్పటి వరకు కదలనీయమని ఆయనను చుట్టుముట్టారు. అయితే తాను మాట్లాడింది తప్పేనని ఈ విషయాన్ని ఇప్పుడే రాజమహేంద్రవరంలో ప్రెస్ మీట్ పెట్టి వివరించానని నారాయణ తెలిసారు. అయినప్పటికీ మా సమక్షంలో క్షమాపణ తెలపాలని పట్టుపట్టారు. దీంతో చేసేదిలేక చేతులు జోడించి తప్పయిపోయింది నేను అలా మాట్లాడి ఉండకూడదని క్షమాపణ కోరారు. దీంతో జనసేన కార్యకర్తలు నాయకులు శాంతించి నారాయణను విడిచి పెట్టారు.
పర్యటన రద్దు చేస్కున్న నారాయణ..
ఇదిలా ఉండగా ఆయన అక్కడ నుంచి కోనసీమ వరద ముంపు ప్రాంతానికి వెళ్లవలసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో మరింత ఆగ్రహంతో చిరంజీవి అభిమానులు ఉన్నారని అక్కడకు వెల్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు సూచించడంతో తన పర్యటన రద్దు చేసుకుని వెను తిరిగారు. సీపీఐ నారాయణను వెంటాడి ఇబ్బందులు గురి చేయడం పై పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఇలా వెంటాడి ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సరైన పద్ధతిని మండిపడుతున్నారు.