PV Sunil Kumar va Raghu Rama Krishna Raju:రఘురామకృష్ణరాజును ఎందుకు సస్పెన్డ్ చేయడం లేదు? IPS అధికారి సునీల్ కుమార్ సంచలన పోస్టు!
PV Sunil Kumar va Raghu Rama Krishna Raju: సీబీఐ దర్యాప్తు సరిగా సాగాలంటే రఘురామకృష్ణరాజును పదవుల నుంచి సస్పెండ్ చేయాలని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.

కేసులు విచారణలో ఉన్నప్పుడు ఉప సభాపతి రఘురామకృష్ణరాజును ఎందుకు సస్పెండ్ చేయలేదని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ప్రశ్నించారు. ప్రభావం చూపుతానంటూ తనను సస్పెండ్ చేశారు బాగానే ఉంది ఆయన సంగతి ఏంటని నిలదీశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు. రాష్ట్రంలో కుల ఘర్షణలకు కారణమయ్యేలా ప్రసంగాలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ అరెస్టులో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తనను టార్చర్ చేశారని రఘురామకృష్ణ రాజు కేసు పెట్టారు. అప్పట్లోనే ఆయన ఈ కేసు నమోదు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు రీ ఓపెన్ చేశారు. దర్యాప్తులో భాగంగా సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన్ని రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌కేసులో విచారిస్తున్నారు. సోమవారం కూడా పోలీసులు పిలిచి నాడు ఏం జరిగిందని ప్రశ్నించారు. కేసు విచారణ జరుగుతోందని ఆయన్ని ఇన్ని రోజులు సస్పెండ్ చేయడాన్ని సునీల్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.

కేవలం తననే సస్పెండ్ చేయడాన్ని సునీల్ కుమార్ క్వశ్చన్ చేస్తున్నారు. తనతోపాటు రఘురామకృష్ణరాజును ఎందుకు ఇంకా పదవి నుంచి తొలగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఇదే అంశాన్ని సోషల్ మీడియోలో పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆయనపై ఉన్న సీబీఐ కేసుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. "దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా, CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుంచి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి." అని అభిప్రాయపడ్డారు.





















