Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు కాకినాడ సాయం
శ్రీలంకకు బియ్యం తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. వ్యాపారపరంగానే కాకుండా మానవతా సాయం కింద పంపే సరకుల సరఫరాలోనూ కాకినాడ పోర్టు కీలక భూమిక పోషిస్తోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న లంకకు మానవతా సాయం కింద 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలుత 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయనుంది. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నులను చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. ఈ నౌక మరో రెండు రోజుల్లో కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
సరకుల రవాణలో కీలకంగా పోర్టు..
శ్రీలంకకు బియ్యం తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆఫ్రికా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతి చేయడానికి దేశంలో 22 మేజర్, 205 నాన్ మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం శ్రీలంకకు సైతం ఇక్కడి నుంచే బియ్యం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారపరంగానే కాకుండా మానవతా సాయం కింద పంపే సరకుల సరఫరాలోనూ కాకినాడ పోర్టు కీలక భూమిక పోషిస్తోంది. కాగా.. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని శ్రీలంకకు పంపుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన స్వర్ణ రకం బియ్యం కూడా ఉన్నాయి.
రవాణా ప్రక్రియ వేగవంతం..
తొలుత 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం శ్రీలంక ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకుంది. ఆ సంస్థ బియ్యం సరఫరాకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా బియ్యానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతా సాయం ప్రకటించింది. బియ్యం సరఫరాకు అయ్యే ఖర్చుకు తాము పూచీగా ఉంటామని, ఆర్థిక భారం భరిస్తామని.. ఆలస్యం కాకుండా వెంటనే బియ్యం ఎగుమతి చేయాలని సదరు సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బియ్యం ఎగుమతులకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. 40,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయాల్సి ఉండగా.. అత్యవసరంగా 11,000 మెట్రిక్ టన్నులను రెండు రోజుల్లో పంపేందుకు కాకినాడ పోర్టులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను శుక్రవారం, శనివారంలోగా లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీలంకకు నౌక బయలుదేరనుంది. ఈ బియ్యాన్ని నేరుగా శ్రీలంకలోని చౌకధరల డిపోలకు సరఫరా చేస్తారు. శ్రీలంక ప్రజలకు త్వరగా బియ్యం అందడంలో ఆలస్యాన్ని నివారించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
శ్రీలంకకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న బియ్యం ఎగుమతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనీ, ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నౌకలోకి లోడ్ చేశాం. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను కూడా త్వరితగతిన లోడ్ అయ్యేలా చూస్తున్నామనీ యాంకరేజ్ పోర్టు అధికారి రాఘవరావు తెలిపారు.