Godavari River:పోటెత్తుతున్న ఉగ్రగోదావరి - భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన వరద
Godavari News: గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 45 అడుగుల స్థాయికి చేరింది. ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు.
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువలా వస్తున్న వరద ప్రవాహంతోపాటు గోదావరి పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద భారీగా పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద 45 అడుగుల స్థాయికి చేరింది. అప్రమత్తమైన అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువనున్న నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.
భద్రాచలం నుంచి ఉరకలెత్తుతూ ప్రవహిస్తోన్న వరద నీరు ధవళేశ్వరం వద్దకు చేరుతుండడంతో దిగువకు 9,01,025 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు జలవనరుల శాఖ అధికారులు. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండగా మరో 24 గంటల వ్యవధిలో ఇక్కడ 47 అడుగుల స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పెరుగుతోన్న వరద ఒరవడితో ధవళేశ్వరం వద్ద 11.10 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరింది.
లంక గ్రామాల ప్రజల అప్రమత్తం..
ధవళేశ్వరం నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వదులుతుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ధవళేవ్వరం హెడ్‌వర్క్స్ అధికారులు చెబుతున్నారు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ ప్రవాహ స్థాయి బాగా పెరుగుతుందని, ఈ నదీ ప్రవాహ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18కు పైగా లంక గ్రామాల్లో వరదలను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ దృష్టి సారించారు. అక్కడ ప్రత్యేకాధికారులను నియమించారు.
వరద ప్రభావిత లంక గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కూడా పలు లంక గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. పలు లంక ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క ఏజెన్సీ ప్రాంతమైన ఏడు విలీన మండలాలతోపాటు దేవీపట్నం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ వాగులు పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని వాగులు దాటేప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
Also Read: కోనసీమలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
పంటు దాటింపులను నిలిపివేసిన అధికారులు
గోదావరి ప్రవాహం ప్రమాదభరితంగా మారడంతో వశిష్ట, గౌతమి నదీపాయల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఉరకలెత్తుతున్న వరద ప్రవాహానికి పలు రేవుల్లో పంటు, పడవ దాటింపులు అధికారులు నిలిపి వేశారు. నర్సాపురం-సఖినేటిపల్లి, కోటిపల్లి-ముక్తేశ్వరం రేవుల పంటు దాటింపులను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా అంబేడ్కర్ కోనసీమజిల్లాలో 15కు పైగా ఉన్న పడవ దాటింపులను నిలిపివేశారు.
అల్పపీడనంతో వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచిన వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు పడతాయని, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మరోపక్క సముద్రంలో అల్పపీడ ద్రోణి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వేటకు వెళ్లేవారు విరమించుకోవాలని అధికారులు హెచ్చరించారు.
Also Read: హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు, విజయవాడలో కన్నీటి దృశ్యాలు