Harsha Kumar Strike: కోడికత్తి కేసు నిందితుడి విడుదల కోసం హర్షకుమార్ దీక్ష- మద్దతు తెలిపిన శ్రీను ఫ్యామిలీ
Harsha Kumar Strike: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనును విడుదల చేయాలంటూ...అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షకు దిగారు.
Kodi Kathi Case : కోడికత్తి కేసు నిందితుడు శ్రీను(Srinu)ను విడుదల చేయాలంటూ...అమలాపురం మాజీ ఎంపీ (Ex Mp)హర్షకుమార్ (Harsha Kumar)దీక్షకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని తన నివాసంలో హర్షకుమార్ నిరసన చేపట్టారు. దీక్షలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు పాల్గొన్నారు. తాను ఐదేళ్లుగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నానని.. తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాసేందుకు అనుమతివ్వాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ పై కోడికత్తితో దాడి
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ పై కోడి కత్తితో దాడికి పాల్పడ్డారు శ్రీను. 2019 నుంచి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. శ్రీనుకు బెయిల్ రావాలంటే సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంది. తన కొడుకు జైల్లో తీవ్ర అవస్థలు పడుతున్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడని...ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే శ్రీనుకు బెయిల్ రావడం లేదని నిందితుడి తరఫు న్యాయవాది సలీం అంటున్నారు.
ఎలాంటి కుట్ర కోణం లేదన్న ఎన్ఐఏ
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కోడి కత్తితో జనుపల్లి శ్రీనివాస రావు దాడి చేశాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. జగన్ పై జరిగిన దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది.
వీఐపీ లాంజ్‌లో జగన్ పై దాడి
2018లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దాంతో మధ్యాహ్నంలోపు పాదయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్...విఐపీ లాంజ్ లోకి వెళ్లారు. వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో...అక్కడి క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీను కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.