East Godavari News: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- కవలలు సహా ఐదుగురు మృతి
East Godavari News: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురు మృతి చెందారు. దుర్ఘటనపై సీఎం, డీసీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

East Godavari News: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వాడిశలేరు గ్రామం హైవేపై ఘోర రోడ్డు జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ముగ్గురు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా కవల గొయ్యి గ్రామానికి చెందినవారు. రెండు కుటుంబలు సోమవారం కాకినాడ బీచ్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
వాడిశలేరు హైవేరోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో స్పాట్‌లోననే ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఐదేళ్ల బాలిక ఉంది. గాయపడిన ఇద్దరు పురుషులను, ఒకర మహిళను హాస్పిటల్‌కి తరలించారు.
చనిపోయిన వారి వివరాలు
1. రేలంగి శివన్నారాయణ - 40 ఏళ్లు-రఘునాథపురం గ్రామం రాజానగరం మండలం.
2. రేలంగి దేవి లలిత-34 ఏళ్లు- రఘునాథపురం గ్రామం రాజనగరం మండలం
3. రేలింగి వర్షిత - 13 ఏళ్లు- రఘునాథపురం గ్రామం రాజనగరం మండలం
4. తీగిరెడ్డి శివ - 30 ఏళ్లు- కవల గొయ్యి గ్రామము రాజమహేంద్రవరం రూరల్ మండలం
5. తీగిరెడ్డి సాన్వి - 4 ఏళ్లు- కవలగొయ్యి గ్రామము, రాజమహేంద్రవరం రూరల్
గాయపడిన బాధితులు
1. తీగిరెడ్డి భవాని-26 ఏళ్లు- కవలగొయ్యి గ్రామం
2. రేలంగి హర్షిత -13 ఏళ్లు- రఘునాథపురం గ్రామం
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రిచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన వెళ్లారు. మృతదేహాలు పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరుచూ రోడ్డు ప్రమాద ఘటనలు జరగడం శోచనీయమన్నారు. రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు కవలలు చనిపోవడం మనసు కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని సూచించారు. తరుచు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయని వివరించారు. జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.





















