నేను పవన్ తొత్తును కాదు ఏమన్నా పడటానికి, పవన్‌కు మరో ఘాటు లేఖ రాసిన ముద్రగడ
తాను పవన్ కల్యాణ్‌ను ఎప్పుడూ టార్గెట్ చేసి విమర్శలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. కానీ పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన అభిమానలు, పార్టీ నేతలు తనను టార్గెట్ చేసుకున్నారని వాపోయారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ మీద లేఖలు రాస్తున్నారు. రెండు రోజుల క్రితం రాసిన లేఖపై చర్చ ఇంకా ముగిసి పోలేదు. ఇప్పుడు మరో లేఖ రాశారు. ఈసారి మరింత ఘాటైన పదాలతో విడుదల చేశారు.
తాను పవన్ కల్యాణ్‌ను ఎప్పుడూ టార్గెట్ చేసి విమర్శలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. కానీ పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన అభిమానలు, పార్టీ నేతలు తనను టార్గెట్ చేసుకున్నారని వాపోయారు. తనతోపాటు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. పవన్ అభిమానులమంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారని బండబూతులు తిడుతున్నారని అన్నారు. మరికొందరు పచ్చిబూతులతో మెసేజ్‌లు పెడుతున్నారని వాపోయారు.
ఇలాంటి ఫోన్ కాల్స్‌కి, మెసేజ్‌లకు భయపడే రకం తాను కాదన్నారు ముద్రగడ. అసలు తనను తిట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని పవన్‌ను, ఆయన అభిమానులను ప్రశ్నించారు. తనతోపాటు ద్వారంపూడిని తిట్టడం తప్పో రైటో పవన్‌తోపాటు జనసైనికులు ఆలోచించుకోవాలన్నారు. తాను పవన్ వద్ద నౌకరీని కాదన్నారు. తనకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన పార్టీకి తొత్తులుగా ఉండాలా అని నిలదీశారు.
వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం నడుస్తోంది. వారాహీ విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై సీరియస్ కామెంట్స్ చేయడమే కాకుండా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. దానికి ఆయన నుంచి కూడా గట్టిగానే కౌంటర్ వచ్చింది. ఈ వివాదం సాగుతుండగానే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ తీరును తప్పుపడుతూ ఓ లేఖ రాశారు.
ముద్రగడ రాసిన తొలి లేఖ సంచలనంగా మారింది. కాపు ఉద్యమం టైంలో ఎక్కడున్నారని ప్రశ్నిస్తూనే అధికార పార్టీని ముఖ్యంగా ద్వారంపూడికి సపోర్ట్ చేస్తూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట తీరును ఆక్షేపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.
జనసేన అధినేతను విమర్శిస్తూ ముద్రగడ రాసిన లేఖపై జనసేన పార్టీకి నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు రెచ్చిపోయారు. విమర్శల దాడి కొనసాగిస్తూనే వినూత్న నిరసన కూడా చేపట్టారు. కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని వైఎస్‌ఆర్‌సీపీకి ముద్రగడ తాకట్టు పెట్టారని రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. దీనికి ఆయనకు ఒక్కో కార్యకర్త వెయ్యి రూపాయల చొప్పున ముద్రగకు డబ్బులు పంపించారు. గోదావరి జిల్లాల్లో దీన్నో ఉద్యమంలా చేపట్టారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాపు ఉద్యమానికి సహకరించారని లేఖలో ముద్రగడ కొనియాడారు. దీంతో కాపు ఉద్యమంలో ముద్రగడతో ప్రయాణించినప్పుడు తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఆ ఉప్మా పంపిన ద్వారంపూడికి డబ్బులు తిరిగి పంపాలంటూ ముద్రగడకు మనియార్డర్లు పంపుతున్నారు. ఉద్యమాన్ని ద్వారంపూడికి తాకట్టు పెట్టిన ముద్రగడ తిరిగి డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు తిన్న ఉప్మాకూ డబ్బులు పంపుతున్నాం’’ అంటూ జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ వ్యాఖ్యలు చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial