Cyclone Mondous: మాండూస్ తుపాను ఎఫెక్ట్, అకాల వర్షాలతో అన్నదాతల్లో పెరిగిన ఆందోళన
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కేవలం 30 శాతం మాత్రమే వరి పంటకు సంబందించి కోతలు పూర్తయ్యాయి. లోతట్టు కమతాల్లోని వరి చేలన్నీ ముంపుకు గురవుతున్నాయ. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Cyclone Mondous Effect: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండూస్ తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాస్త ప్రకృతి వైఫరీతాల్యనుంచి గట్టెక్కిందనుకుంటున్న క్రమంలో తుపాను ప్రభావంతో అకస్మాత్తుగా వచ్చిపడ్డ అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కేవలం 30 శాతం మాత్రమే వరి పంటకు సంబందించి కోతలు పూర్తయ్యాయి.. మరో 20 శాతం చేలల్లో వరి పనలుగాను, గట్టుమీద కల్లాల్లో రాసులుగాను చాలా వరకు పంట ఉండిపోయింది. ఇక 50 శాతం వరకు కోతలు ఇంకా ప్రారంభించనేలేదు.. కోతలు ప్రారంభించని రైతులు వరకు పరవాలేదుకానీ కల్లాల్లోను, చేలల్లోనూ ఉండిపోయిన పంటకు సంబందించి రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఒబ్బిడి చేసుకున్న ధాన్యాన్ని బరకాల సాయంతో కప్పెట్టుకుని వర్షాలనుంచి పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు రైతులు. అయితే చేలల్లో పనల రూపంలో ఉండిపోయిన పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో శుక్రవారం మద్యాహ్నం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తునే ఉంది. పలు తీర గ్రామాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు కమతాల్లోని వరి చేలన్నీ ముంపుకు గురవుతున్నాయ. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాగా పెరిగిన చలిగాలుల తీవ్రత..
తీర గ్రామాల్లో మాండూస్ తుపాను ప్రభావంతో ఓ పక్క వర్షాలు కురుస్తుండగా తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావంతో చలిగాలులు బాగా పెరిగాయి.. దీంతో చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ఎడతెరిపి లేని వర్షాలు మరో పక్క చలిగాలులు ప్రజలు బయటకు వెళ్లేందకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.
ఉప్పాడ బీచ్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత..
కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మాండూస్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడిసముద్రపు అలలు ఉవ్వెత్తున లేచి పడుతుండడంతో అలలు రోడ్డుమీదకు వస్తున్నాయి. దీంతో ఇది ప్రమాదకరంగా మారడంతో కాకినాడాఉప్పాడ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు. దీంతో రోడ్డుపై బండరాళ్లు అడ్డుగా వేయించి వాహనాల రాకపోకలను నిలిపివేయించారు తిమ్మాపురం పోలీసులు. ఇదిలా ఉంటే నేమాం అనే ప్రాంతం వద్ద అలల ఉద్ధృతికి తీరం కోతకు గురైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్ గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి శనివారం (డిసెంబరు 10) ఉదయానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు. తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల పది మీటర్ల నుంచి 20 మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింది.