AP Volunteers: ఈనెల 14 నుంచి ‘వలంటీర్లకు వందనం’ - అవార్డులతో పాటు రివార్డులు!
AP Volunteers: వలంటీర్లను సత్కరించేందుకు ప్రభుత్వం వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఈ నెల 14 నుండి ఈ కార్యక్రమం మొదలు కానుంది.
AP Volunteers: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ సంక్షేమ పథకాలు అందరికీ.. చేరువయ్యేలా చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా సత్కరించబోతోంది. ఏడాది కాలంగా వాలంటీర్ గా పని చేస్తూ.. ఎలాంటి ఫిర్యాదులకు తావులేని మొత్తం 2,33,719 లక్షల మంది వాలంటీర్లను ఏపీ సర్కారు సత్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14వ తేదీన గోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెల రోజుల పాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కారాల కార్యక్రమాలు కొనసాగుతాయి. సీఎం జగన్ ఆధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ.. ఏటా ఉగాది సందర్భంగా వాలంటీర్లకు వందనం పేరుతో ఈ సత్కారాలను నిర్వహిస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 ఏప్రిల్ 14వ తేదీన వాలంటీర్ల సత్కారాల కార్యక్రమం నిర్వహించగా.. మరుసటి ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఈ ఏడాది ఉగాది సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈనెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం వాలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
అవార్డులే కాదండోయ్ రివార్డులు కూడా..
ప్రతీ నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లను సేవా వజ్ర పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జీ, శాలువా, ధ్రువపత్రాలతో సత్కరిస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ నుండి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుండి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి సేవా రత్న అవార్డు, రూ.20 వేల నగదు, మెడల్, శాలువా, బ్యాడ్జీ, ధ్రువపత్రం అందజేస్తారు. 2,38,624 మందికి సేవా మిత్ర పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు. వాలంటీర్ల పనితీరు, ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి, గడప గడపకు మన ప్రభుత్వంకార్యక్రమంలో వాలంటీర్ల హాజరు, ప్రతి నెలా మొదటి రోజునే 100 శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం తీసుకువచ్చే చాలా పథకాల్లో వాలంటీర్లదే కీలక పాత్ర. ఏ పథకం తీసుకువచ్చినా దానిని జనాలకు చేరువ చేసేది వాలంటీర్లే. ఎక్కడికి వెళ్లినా పథకాలు ఎవరు ఇస్తున్నారు అంటే.. వాలంటీర్ ఇస్తున్నారని చెప్పేవాళ్లే ఎక్కువ. అంతలా జనాలకు చేరువ అయ్యారు వాలంటీర్లు. అయితే దీని వల్ల వాలంటీర్లు చేతికి అందకుండా పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లు ఎవరీ మాట వినకుండా తయారయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తీసుకువచ్చిన ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మరింతగా రెచ్చిపోతారని సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి.