Amalapuram Latest News: టికెట్‌పై రూ. 40 అదనంగా తీసుకున్నారని అమలాపురంలో థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ!
Amalapuram Latest News: అమలాపురంలో కోర్టు సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ రెండు టిక్కెట్లు కొనుక్కుంది. టిక్కెట్టుపై రూ.40 అదనంగా అమ్మడంతో మొత్తం ఆ థియేటర్‌నే మూయించింది.

Amalapuram Latest News: భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ టైంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. అలా పెంచిన రేట్లు కారణంగా సినిమాలకు సామాన్యులు దూరమైపోతున్నారనే విమర్శ ఉండనే ఉంది. సినిమా హిట్ టాక్ వచ్చింది అంటే చాలు టికెట్ రేట్లతో సంబంధం లేకుండా చూసేటోళ్లు ఉన్నారు.
భారీ బడ్జెట్ సినిమాలు మాదిరిగానే లో బడ్జెట్ సినమాల టికెట్లు రేట్లు పెంచేందుకు కొందరు యత్నిస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చేసిన ఓ థియేటర్ యజమానికి అధికారులు షాక్ ఇచ్చారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో "కోర్టు" సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ అనే థియేటర్ యాజమాన్యంపై అమలాపురం ఆర్డీవో కె.మాధవి చర్యలు తీసుకున్నారు.
ఈ థియేటర్‌లో టికెట్లు 40 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజమేనని తేలడంతో ఆర్డీవో చర్యలు చేపట్టారు. థియేటర్ సీజ్ చేశారు.
సాధారణ ప్రేక్షకునిగా వెళ్లిన ఆర్డీవో...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ వచ్చి టిక్కెట్టు కౌంటర్ వద్దకు వెళ్లి కోర్టు సినిమాకు రెండు ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లు కావాలని అడిగారు. రూ.300 ఇచ్చుకుని రెండు టిక్కెట్లు ఇచ్చాడు కౌంటర్‌లో టిక్కెట్టు అమ్ముతున్న వ్యక్తి. టిక్కెట్టు తీసుకున్న ఆమె నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా అదే కౌంటర్‌లోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.
ఆ మహిళ వెంట సబార్డినేట్, స్థానిక తహసీల్దార్ ఉండడంతో ఆమె నార్మల్ వ్యక్తి కాదని తెలిసింది. ఆమె సినిమా చూడడానికి రాలేదని తనిఖీల కోసం వచ్చిన అమలాపురం ఆర్డీవో కె.మాధవి అని తేలింది.
ధరలు పెంచి అమ్ముతుండడంపై ఆగ్రహం..
"కోర్టు" సినిమాకు రూ.110 టిక్కెట్టు అమ్మాల్సి ఉంది. కానీ సాధారణ మహిళగా వచ్చిన ఆర్డీవోకే రూ.150 అమ్మడంతో థియేటర్ యాజమాన్యం అడ్డంగా బుక్ అయింది. లైవ్ సాక్ష్యాలు ఉండటంతో చర్యలకు ఉపక్రమించారు ఆర్డీవో మాధవి. కేవలం "కోర్టు" సినిమాకే కాదు ఈ థియేటర్‌లో ఆడుతున్న ప్రతి సినిమాకు ధరలు పెంచి అమ్ముతున్నారని రికార్డుల ఆధారంగా గుర్తించారు. థియేటర్ అనుమతుల రెన్యువల్ గడువు ముగిసినప్పటికీ సినిమాలు ప్రదర్శిస్తుండడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెన్యువల్ చేయించుకోకుండా సినిమాలు ప్రదర్శించడం, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. కేసు నమోదు చేశారు.. థియేటర్ సీజ్ చేశారు.
దెబ్బకు దారిలోకి వచ్చిన థియేటర్లు..
సినిమా థియేటర్‌లపై రెవెన్యూ అధికారులు దాడుల చేయడంతో అమలాపురంలోనే కాదు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని థియేటర్ల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. పెంచిన టిక్కెట్టు రేట్లు ఒక్కసారిగా తగ్గించి అమ్మడం మొదలు పెట్టారు. టాయిలెట్లు శుభ్రం చేయించడం, థియేటర్ ప్రాంగణంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ ధరలకు విక్రయించడం కూడా మానేశారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలంటున్నారు సగటు ప్రేక్షకులు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

