Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
Anyam Sai: అన్యం సాయి జనసేనకు చెందినవాడని కొన్ని ఫోటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ కే అతను అనుచరుడు అని విపక్ష నేతలు రుజువులు చూపిస్తున్నారు.
Amalapuram Riots: అమలాపురంలో మంగళవారం (మే 24) చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రదారిగా భావిస్తోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్యం సాయి పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో ఇతను కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద కూడా ఒంటిపై అన్యం సాయి పెట్రోల్ పోసుకున్నాడు. అతనిపై గతంలోనే పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లుగా తెలుస్తోంది.
అప్పుడు జనసేన, ఇప్పుడు వైసీపీ?
గతంలో జనసేన పార్టీలో ఉన్న అన్యం సాయి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరాడు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఓ అధికారి దగ్గర డ్రైవర్‌గా పని చేసే ఇతనికి నాయకులందరితో ఫోటోలు దిగే అలవాటు ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా కోనసీమ ఉద్యమం అంటూ కొద్దిరోజులుగా వాట్సాప్ గ్రూప్‌లలో అన్యం సాయి పోస్ట్‌లు పెడుతున్నట్లు తెలుస్తోంది.
అన్యం సాయి జనసేనకు చెందినవాడని కొన్ని ఫోటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ కే అతను అనుచరుడు అని విపక్ష నేతలు రుజువులు చూపిస్తున్నారు. గతంలో వైసీపీకి చెందిన కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో ఉన్న పోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
రావులపాలెం వద్ద కూడా అరెస్టులు
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని డిమాండ్ చేస్తూ చలో రావులపాలెం కార్యక్రమానికి సిద్ధమైన మరికొంత మంది యువకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎల్. పోలవరం వద్ద 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రావులపాలెం పోలీసు స్టేషన్ కు తరలించారు.
పేరు మార్పు వల్లే..
రెండు నెలల క్రితం రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక డిమాండ్ లు వస్తున్నందున తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు మారుస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ‘కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అమలాపురం పట్టణంలో విధ్వంసం చేశారు. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలు అయ్యాయి.