Pithapuram Latest News: పవన్ ఇలాఖాలో భూకబ్జా ఆరోపణలు- పోరాటానికి సిద్ధమన్న వామపక్షాలు
AP Deputy CM Pawan Kalyan Latest News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఆయన తాలూకా అంటూ కొందరు 41 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేశారని ఆరోపణలు వస్తున్నాయి.

AP Deputy CM Pawan Kalyan Latest News: పిఠాపురం అనగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తారు. 2024 సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి పిఠాపురం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో సైతం మార్మోగిపోయింది. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆపై కూటమి ప్రభుత్వం మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో సోషల్ మీడియాలో ఓ కొటేషన్ బాగా ట్రెండ్ అయ్యింది. అదే పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. ఈ ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియాలోనే కాదు ద్విచక్రవాహనాలపై, కార్లు, ఇతర వాహనాలపైనే కాకుండా నెంబర్ ప్లేట్లపై ఇది దర్శనం ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ సీపీఎం నాయకుల విమర్శలతో మళ్లీ చర్చకు వచ్చింది. అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులు పేదల కోసం సేకరించిన భూమిని కబ్జా చేశారంటూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆరోపించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది..
సీసీఐ నాయకులు ఏం ఆరోపిస్తున్నారు..?
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి అనే గ్రామాన్ని రెండు రోజుల క్రితం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పలువురు సీపీఐ నాయకులు పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం సేకరించిన స్థలాల వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా మధు పలు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరిలో పేదల ఇళ్ల స్థలాల కోసం కోట్ల రూపాయల వెచ్చించి రైతుల నుంచి 41 ఎకరాల భూమిని సేకరించిందని పట్టాలు పంపిణీ పూర్తి కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొందరు ఈ భూమిని కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు. డిప్యూటీ సీఎం, స్థానిక శాసన సభ్యుడైన పవన్ కల్యాణ్, జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని రిక్వస్ట్ చేస్తున్నారు. వాటిని పేదప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ..
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో పార్టీ క్యాడర్ అన్ని ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్టీలో కోఆర్డీనేటర్లును నియమించి ప్లీనరీ విజయవంతం చేసేందుకు కృషిచేస్తోంది. ఇంతలో సీపీఐ ఆధ్వర్యంలో చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

