Varun Tej Campaign: బాబాయి కోసం అబ్బాయి ప్రచారం - పవన్ కళ్యాణ్ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Varun Tej In Pithapuram: బాబాయి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. బాబాయి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు.
Varun Tej campaigns for Pawan Kalyan in Pithapuram- పిఠాపురం: ఏపీలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. అభ్యర్థుల కోసం కుటుంబసభ్యులైన సినీ సెలబ్రిటీలు, తదితరులు రంగంలోకి దిగుతున్నారు. జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరఫున టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికారం లేకపోయినా అన్ని వర్గాలకు అండగా నిలచిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, బాబాయిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని.. దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తారని వరుణ్ తేజ్ అన్నారు.
పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం
మెగా బ్రదర్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ తరఫున శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాబాయి పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే.. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని పేర్కొన్నారు. తాత కొణిదెల వెంకట్రావు ఉద్యోగరీత్యా మా కుటుంబం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నివసించిందన్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామని వరుణ్ తేజ్ తెలిపారు.
గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుణ్ తేజ్ శనివారం నాడు భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ "పడి లేచిన కెరటం మా బాబాయ్ పవన్ కళ్యాణ్. ఓటమిని తట్టుకుని పదేళ్లపాటు ప్రజల కోసం నిలబడ్డారు. పెదనాన్న చిరంజీవితో సహా మా కుటుంబం మొత్తం బాబాయి వెనుకే ఉన్నాం. నేను మీ లాంటి జన సైనికుడినే. జనసేన పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి జన సైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు.
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల వెంటే..
పవన్ కళ్యాణ్ అధికారం చేతిలో లేకున్నా కౌలు రైతుల కష్టాలు తీర్చారు. ఎంతోమంది మత్స్యకారులకు బాబాయి అండగా నిలిచారు. అన్ని వర్గాలకు అండగా నిలచిన నేత పవన్ కళ్యాణ్. మే 13న జరిగే ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా బాబాయ్‌ని, ఎంపీగా టీ టైమ్ ఓనర్ కాకినాడ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని’ వరుణ్ తేజ్ అని కోరారు.
మెగా ప్రిన్స్‌కి గ్రాండ్ వెల్కమ్..
జనసేనాని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన వరుణ్ తేజ్‌కు ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ కి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి తాటిపర్తి, వన్నెపూడి గ్రామాల మీదుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా, ఆడపడుచులు హారతులు పట్టారు. గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి గాజు గ్లాసు గుర్తులు ప్రదర్శించి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. వరుణ్ తేజ్ రోడ్ షోలో అందరికీ అభివాదం చేస్తూ, గాజు గ్లాసు గుర్తును ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.
తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని వరుణ్ తేజ్ సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కొడవలి మీదుగా వరుణ్ తేజ్ ప్రచార యాత్ర దుర్గాడ వరకు సాగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ కన్వీనర్ వి. అజయ్ కుమార్, పార్టీ స్టార్ క్యాంపెయినర్, నటుడు సాగర్, బీజేపీ పిఠాపురం ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు, టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.