Rajahmundry: గోదారోళ్లా మజాకానా, నిశ్చితార్థ వేడుకలో 108 రకాల స్వీట్లు రుచి చూపించారు
Engagement ceremony in Rajahmundry: రాజమండ్రి మంజీరా హోటల్లో నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని 108 రకాల స్వీట్లును తయారు చేశారు.
Engagement ceremony in Rajahmundry:
రాజమండ్రి: గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. ఈ జిల్లా వాసులు ఏది చేసినా దానికొక ప్రత్యేకత ఉంటుంది. గోదారోళ్ళు ఆతిధ్యం పొందారంటే జీవితాంతం మర్చిపోలేరు. ఈ ప్రాంత వాసుల తయారుచేసిన వంటకాల రుచులను ఆస్వాదించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల వారు తహతహలాడుతూ ఉంటారు. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాలు వచ్చాయంటే చాలు పూర్వీకుల వంటకాలన్నీ ప్రత్యక్షమవుతాయి. వాటి అన్నిటిని రుచి చూడాలంటే నెలల కాలం పడుతుంది.
ఇక వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన కుటుంబ సభ్యులు రాజమండ్రి మంజీరా హోటల్లో నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని 108 రకాల స్వీట్లును స్వయంగా తయారు చేయించి వేడుకలకు హాజరైన బంధువులను ఆహా అనిపించారు. రంగులు, రసాయనాలతో ఆకర్షణీయంగా కనిపించే స్వీట్లు మచ్చుకు కూడా కనబడలేదు. కేవలం మన అమ్మమ్మ, నానమ్మలు చేసే వంటకాలైన గోరుమిటీలు, బెల్లం కొమ్ములు, మైసూర్ పాకు, లడ్డు, కాజా వంటి పల్లెటూరి వంటకాలన్నీ తయారు చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాబోయే తరాల వారికి ఈ వంటకాల విశిష్టతను తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇది అట్టాంటి ఇట్టాంటి పెళ్లి కాదు, గోదారోళ్ల పెళ్లి
తెలుగు రాష్ట్రాల్లో సైతం పెళ్లిళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. తెలంగాణలో పెళ్లి జరిగితే ఎక్కువగా ముక్క ఉండాల్సిందే. మటన్, చికెన్ తప్పనిసరి. అలాగే రాయలసీమలో మాత్రం పెళ్లిళ్లలో నాన్ వెజ్ ఉండదు. పక్కా రాయలసీమ స్టైళ్లో ఉంటుంది. గోదావరి జిల్లాల విషయానికి వస్తే వారి రూటే సపరేటు. గోదావరి జిల్లా ప్రజలంటేనే మర్యాదల్లోనూ, ఆతిథ్యంలోను గోదారోళ్ల గురించి ఎవరికైనా చెబితే అబ్బో అనాల్సిందే. ఇక పెళ్లి భోజనం దగ్గర నుంచి అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. వారి మర్యాదల గురించి చెబితే ఔరా అనాల్సిందే. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.
అంబేద్కర్ జిల్లా రాజోలులో ఓ పెళ్లి జరిగింది. అచ్చం సినిమా స్టైల్ కు మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెండ్లి కొడుకు, పెళ్లికూతురు ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ కొడుకు సుఖేష్ పెళ్లి రిసెప్షన్ కన్నుల పండవగా నిర్వహించారు. అంతకు మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. సుఖేష్, శ్రీ రంగనాయకి వినూత్న ఊరేగింపు, బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు, పెళ్లి కొడుకు, కుమార్తె ఊరేగింపులు ఇలా ఒక్కటేమిటీ మాటల్లో చెప్పలేని వైవిధ్యంగా సాగింది.
మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు, అన్నిటికి మించి బుల్లెట్ బైకులపై ఎంట్రీ ఇచ్చారు. రథంపై పెళ్లి కొడుకు ఊరేగింపుతో పెళ్లిలో జోష్ తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.